క్రేజీ మోహన్ ఇక లేరు

crazu-mohan-passed-away-in-chennai

చెన్నై: ప్రముఖ తమిళ సినీ, రంగస్థల నటుడు, రచయిత క్రేజీ మోహన్‌‌ (66) ఇక లేరు. సోమవారం గుండెపోటు రావడంతో ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్ సినిమాలు, సీరియళ్లతో మోహన్ తెలుగువారికీ సుపరిచితులే. కమల్‌‌ హాసన్‌‌ నటించిన అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, సతీ లీలావతి, పంచతంత్రం వంటి చిత్రాలకు మోహన్‌‌ రచయితగా పనిచేశారు. ఆ సినిమాల్లో నటించారు. కెరీర్‌‌‌‌ను నాటకాలతో ప్రారంభించిన మోహన్.. ఇంజినీరింగ్‌‌ చదివే రోజుల్లోనే నాటకాలకు స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు.  ‘క్రేజీ థీవ్స్ ఇన్‌‌ పాలవాక్కం’ అనే నాటకం ద్వారా ఆయన పేరు ముందు ‘క్రేజీ’ అనే పదం వచ్చి చేరింది. నాటి నుంచి ‘క్రేజీ మోహన్‌‌’గా ఫేమస్ అయ్యారు. ‘క్రేజీ క్రియేషన్స్‌‌’ పేరుతో సొంత డ్రామా ట్రూప్‌‌ కూడా నడిపారు. బాలచందర్ రూపొందించిన ‘పొయ్‌‌కల్ కుదరై’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన రచయితగానే కాకుండా హాస్య నటుడిగా కూడా సినీ ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కామెడీ రాయడంలోనూ, దాన్ని పండించడంలోనూ ఆయన శైలి విభిన్నం. హెల్దీ కామెడీతో కడుపుబ్బ నవ్వించి లెజెండెరీ కమెడియన్‌‌గా ఖ్యాతి గడించారు. టీవీ సీరియళ్లకూ పని చేశారు. వందకు పైగా షార్ట్‌‌ స్టోరీస్‌‌ రాశారు. ‘వెన్బా’ పేరుతో నలభై వేలకు పైగా సింగిల్‌‌ లైన్‌‌ కవితలు రచించారు. మంచి చిత్రకారుడు కూడా అయిన మోహన్‌‌ ఎన్నో మంచి కళాఖండాలకు ఊపిరిపోశారు. కళారంగంలో తన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ అవార్డును అందుకున్నారు.సంపాదించింది నలుగురి కోసం మోహన్ మానవతా వాది. సంపాదించిన దాంట్లో పేదలకు గుండె ఆపరేషన్లకు, కిడ్నీ ట్రాన్స్‌‌ప్లాంటేషన్లకు విరాళాలు ఇచ్చేవారు.

Latest Updates