గెస్ట్​ లెక్చరర్ల కొలువులకు ఎసరు

రోడ్డున పడనున్న 1500 మంది

కలెక్టర్ల ద్వారా కొత్తవారిని నియమించాలని సర్కారు ఆదేశాలు

కలెక్టర్ల ద్వారా కొత్తవాళ్లను నియమించాలని సర్కార్ ఆదేశాలు

రోడ్డున పడనున్న1,500 మంది గెస్ట్ లెక్చరర్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారీ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్ల కొలువులకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారిని రెన్యువల్ చేయకుండా కొత్త వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ల సెలక్షన్ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గెస్టు లెక్చరర్లలో టెన్షన్ మొదలైంది. రాష్ర్టంలోని 404 సర్కారు జూనియర్ కాలేజీల్లో1,500 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరంతా ఆరేడు ఏండ్ల నుంచి పాఠాలు చెప్తున్నారు. కరోనా నేపథ్యంలో జూన్​లో కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో, కాంట్రాక్టు లెక్చరర్లను మాత్రమే ప్రభుత్వం రెన్యువల్ చేసింది.

తమనూ రెన్యువల్ చేయాలని గెస్టు లెక్చరర్లు కోరుతున్నా.. ఇంటర్ బోర్డు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. కరోనా తీవ్రత తగ్గుతున్నందున డిసెంబర్ లో కాలేజీలను ప్రారంభించే యోచనలో సర్కారు ఉంది. దీంతో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి పర్మిషన్ కోసం గతనెలలో ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందిస్తూ, మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ తాజాగా మెమో ఇచ్చారు. దాంట్లో కలెక్టర్ల ద్వారా గెస్టు లెక్చరర్ల సెలెక్షన్ ప్రాసెస్ చేపట్టాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీకి ఆదేశాలిచ్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే లెక్చరర్ పోస్టులు జోనల్ స్థాయి పోస్టులు కావడంతో, ఈ నియామకాలతో కలెక్టర్లకు సంబంధం లేదన్న వాదనలూ
విన్పిస్తున్నాయి.

రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వాలె: గెస్ట్ లెక్చరర్ల సంఘం

కరోనా విపత్తు నేపథ్యంలో గెస్టు లెక్చరర్లందరినీ మానవతా దృక్పథంతో రెన్యువల్ చేయాలని గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వుల్లో రెన్యువల్ పై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇదే విషయంపై మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రెటరీకి ఆ సంఘం ప్రతినిధులు బాబురావు, మహేశ్ కుమార్​తో కలిసి వినతిపత్రం అందించారు. పాత వారిని కంటిన్యూ చేస్తూ, కొత్తగా ఏర్పడిన ఖాళీలలో గైడ్ లైన్స్ అమలు చేసేలా చూడాలని కోరారు.

Latest Updates