రాజగోపాల్​ v/s కేటీఆర్‌‌.. జీరో అవర్‌‌లో హీరోగిరి వద్దు

హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీలో గురువారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు నిధులు కూడా ఇవ్వడం లేదని రాజగోపాల్​రెడ్డి ప్రశ్నించగా.. ‘జీరో అవర్‌‌లో హీరోగిరి చేస్తామంటే సరికాదు’ అంటూ కేటీఆర్‌‌ మండిపడ్డారు. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు.

పేపర్​ మీదనే నిధులు: రాజగోపాల్​రెడ్డి

కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌‌ మున్సిపాలిటీలకే కాదు రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలకు నిధులివ్వాలి. ఆ మున్సిపాలిటీలకు ఇచ్చినట్టు వందల కోట్లు కాకున్నా కనీసం మురుగునీళ్లు ఆగకుండా డ్రైనేజీ పనులు చేసేందుకు అవసరమైన నిధులైనా ఇవ్వాలి” అని డిమాండ్​ చేశారు. తన నియోజకవర్గంలోని చౌటుప్పల్‌‌, చండూరు మున్సిపాలిటీల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. వర్షాలు కొట్టినపుడు చండూరుకు తాను వెళ్లానని, అసలు మనుషులు ఉండే ప్రదేశమేనా అనే అనుమానం వచ్చిందన్నారు. ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డుకు సమీపంలో ఉన్న చౌటుప్పల్‌‌లో అపార్ట్ ‌‌మెంట్లు కడుతున్నారని, సిటీ మధ్యలో డ్రైనేజీ నీళ్లు నిలిచి ఉంటున్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చి ఆరేండ్లయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. చౌటుప్పల్‌‌కు గతంలో రూ. 4.50 కోట్లు ఇచ్చినట్టు చెప్పారని, నిధులు విడుదల చేయక అవి ల్యాప్స్‌‌ అయ్యాయని పేర్కొన్నారు. కేవలం పేపర్‌‌ మీదనే నిధులు ఇస్తే ఎట్లా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సమస్యలు చెప్తుండగానే మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి సహా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ‘ఇది జీరో అవర్‌‌’ అంటూ రన్నింగ్‌‌ కామెంట్రీ చేశారు.

అభివృద్ధి చేయకపోతే ఎట్ల గెలుస్తం: కేటీఆర్​

మంత్రి కేటీఆర్‌‌ సమాధానమిస్తూ.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నను నోట్‌‌ చేసుకున్నామని, పరిశీలిస్తామని చెప్పా రు. చండూరు, చౌటుప్పల్‌‌ మున్సిపాలిటీలకు నిధులివ్వలేదనడం సరికాదన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. తాము అభివృద్ధే చేయకపోతే మొన్న 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్‌‌ పదవులు టీఆర్‌‌ఎస్‌‌ ఎట్ల కైవసం చేసుకుందని ప్రశ్నించారు. జీరో అవర్‌‌లో మైక్‌‌ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే సరికాదని మండిపడ్డారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య జీవో 111 కారణంగా పేద రైతులు తమ భూములు అమ్ముకోలేకపోతున్నారని, వెసులుబాటు ఇవ్వాలంటూ సుదీర్ఘంగా సమస్యను చెప్పేందుకు ప్రయత్నించగా.. కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే జీరో అవర్‌‌ వర్తిస్తుందా అని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.

Latest Updates