పంటల మ్యాపింగ్‌ షురూ

జిల్లాల వారీగా మొదలు పెట్టిన వ్యవసాయ శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ పంటలేయాలో వ్యవసాయ శాఖ ప్లాన్‌‌ షురూ చేసింది. జిల్లాల వారీగా పంటల టార్గెట్‌‌లను మ్యాపింగ్‌‌ చేసి కలెక్టర్లు, డీఏవోలకు వివరాలు అందించింది. కలెక్టర్లు కూడా మండలాల వారీగా పంటల కేటాయింపుపై వ్యవసాయ అధికారులతో మాట్లాడి ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలు పెట్టారు. ఈ సీజన్‌‌ నుంచే లిమిటెడ్‌‌గా పంటలు సాగు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్లాన్‌‌ స్టార్టయిపోయింది.

మండలాల వారీగా ప్లాన్‌‌
జిల్లాకు కేటాయించిన పంటలను మండలాల వారీగా విభజించి ప్లాన్‌‌ రెడీ చేసేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌‌లు పెట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. మండలాలకు ఇచ్చిన టార్గెట్‌‌ల ప్రకారం క్లస్టర్ల వారీగా కేటాయింపులు చేస్తున్నారు. క్లస్టర్‌‌లకు ఇంచార్జులైన ఏఈవోలు గ్రామాల వారీగా ఏ పంట, ఎంత వేయాలో నిర్ణయం తీసుకోనున్నారు.

గ్రామాల వారీగా సమావేశాలు
క్లస్టర్‌‌ల వారీగా కేటాయింపులను బట్టి వాటి పరిధిలోని ఊర్లల్లో ప్రణాళిక రెడీ చేస్తున్నారు. రైతులతో ఏఈవోలు సమావేశాలు పెట్టి ప్లాన్ ను వివరించాలి. నిర్ణయించిన పంటలేసేలా రైతులను ఒప్పించే బాధ్యత ఏఈవోలకే అప్పగించారు.

పంటను సూచించడం కష్టమే
అధికారులను నమ్మి రైతులు పంటేసే పరిస్థితి లేదని క్షేత్ర స్థాయి సిబ్బంది అంటున్నారు. ఇట్లాంటి విత్తనాలు వేస్తే దిగుబడి వస్తుందంటే వింటారు గాని చెప్పిన పంటే వేయాలని ఒప్పించడం సులువు కాదంటు న్నారు. సీన్‌‌ రివర్సయితే రైతుల ఆగ్రహం ఫస్ట్‌‌ తగిలేది తమకేనని ఏఈవోలు అంటున్నారు.

గ్రౌండ్‌‌ లెవల్‌‌ నుంచి ప్లానుండాలె
ఏ పంట, ఏ రైతు, ఎంత వేస్తారో.. అక్కడ నీళ్లు ఎలా అందుబాటులో ఉంటాయి, నేల రకమేంటి.. లాంటి వివరాలు అధికారుల దగ్గరుండాలని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. దాని ప్రకారం ఆ ఊర్లో పంట నిర్ధారిస్తే కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్లాన్‌‌ కింది నుంచి పై స్థాయికి వెళ్తే స్పష్టత ఉండేదని అగ్రి కల్చర్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌ పురుషోత్తం చెబుతున్నారు.

రైతుల్లో నమ్మకం పెంచాలె
ప్లాన్‌‌ ప్రకారం వ్యవసాయం నడవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని రైతు సంఘాల నేతలు అన్నారు. కానీ కనీస ప్రిపరేషన్‌‌ లేకుండా తక్కువ టైమ్‌‌లో రైతులపై రుద్దడం సరి కాదంటున్నారు. భూసార పరీక్షలు లేకుండా, పంటలకు మద్దతు రేట్లు ముందే ప్రకటించి, కొనుగోలు గ్యారెంటీ ఇస్తే రైతుల్లో నమ్మకం వస్తుందని చెబుతున్నారు. హడావుడిగా చేస్తే అనర్థమని రైతు సంఘం కార్యదర్శి సాగర్‌‌ చెప్పారు.

Latest Updates