జిల్లాలు అతలాకుతలం..మునిగిన పంటలు..తెగిన రోడ్లు

  • 20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి,ఇతర పంటలకు నష్టం
  • కల్లాల్లో మొలకలెత్తిన ధాన్యం చూసి రైతుల కంటతడి
  • రోడ్లు, కల్వర్టులు కొట్టు కుపోయినిలిచిన రాకపోకలు
  • హైదరాబాద్ వచ్చే హైవేలపైగంటలకొద్దీ ట్రాఫిక్ జామ్
  • వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో నీటమునిగిన కాలనీలు

వెలుగు, నెట్వర్క్మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు జిల్లాల్లో ప్రాణ, ఆస్తి, పంట నష్టం ఊహకందని స్థాయిలో  ఉంది. సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చేన్లలో ఒరిగిన వరిని, తడిసి ముద్దయిన దూదిని, కల్లాల్లో మొలకలెత్తిన వడ్లను చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల్లో వరదల కారణంగా వందలాది చిన్న, పెద్ద రోడ్లు తెగిపోయి పలు ప్రాంతాల నడుమ రాకపోకలు నిలిచాయి.  హైదరాబాద్​ వచ్చే హైవేలకు గండ్లు పడి మంగళ, బుధవారాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్​జామ్​ఏర్పడింది. పలు పట్టణాల్లో కాలనీలు నీటమునిగి జనం అష్టకష్టాలు పడ్డారు. కొందరు రిలీఫ్​ క్యాంపుల్లో తలదాచుకోగా, దాతలు ఫుడ్​ అందజేశారు.

లక్షలాది ఎకరాల్లో పంట నష్టం

వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. కోత కొచ్చిన వరి పంట నేలకొరగగా,  కోతలు పూర్తయి కల్లాల్లో ఉన్న వడ్లు మొలకలు వచ్చాయి. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి పంట దెబ్బతిన్నది. సిద్దిపేట జిల్లాలో  65,925 ఎకరాల్లో,  మెదక్ జిల్లాలోని 74వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం జరిగినట్లు అగ్రికల్చర్​ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కరీంనగర్​ జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరి, 2 వేల  ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 2,990 మంది రైతులకు సంబంధించి 3,932 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు ఆఫీసర్లు చెప్పారు. సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయిలో కోతలు పూర్తికాగా పొలంలోనే వడ్లకు మొలకలొచ్చాయి. జగిత్యాల జిల్లాలో 6,525 మంది రైతులకు చెందిన 8,917 ఎకరాల వరి, పత్తి పంటలకు నష్టం జరిగిందని ఆఫీసర్లు అంచనా వేశారు.  వరంగల్​ అర్బన్​ జిల్లాలో 12 వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. జనగామ జిల్లాలో 16,673 ఎకరాల్లో వరి,10,015 ఎకరాల్లో పత్తి, 19 ఎకరాల్లో కంది, 50 ఎకరాల్లో మిర్చి పంటలకు నష్టం జరిగింది. మహబూబాబాద్​జిల్లాలో 4,210 ఎకరాల్లో వరి, పత్తి నష్టపోయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు.  సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా 13,812 ఎకరాల్లో వరి, 4,864 ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం జరిగింది. ఆఫీసర్ల లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 43,794 ఎకరాల్లో వరి, పత్తి పంట దెబ్బతిన్నది. కామారెడ్డి జిల్లాలో 14,261  ఎకరాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతినగా, లింగంపేట మండలం భవానిపేట్​తో పాటు చాలా చోట్ల మొలకలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 75,364 ఎకరాల్లో,  జోగులాంబగద్వాల జిల్లా లో 8,141 ఎకరాల్లో పంట నష్టం జరిగిట్లు ఆయా జిల్లాలకు చెందిన అగ్రికల్చర్​ ఆఫీసర్లు వెల్లడించారు.

రోడ్లు తెగి నిలిచిన రాకపోకలు

కనీవినీ ఎరగని వరదల కారణంగా రోడ్లకు గండ్లు పడి వివిధ జిల్లాలకు హైదరాబాద్​తో సంబంధాలు తెగిపోయాయి. మంగళ, బుధవారాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెదక్​ జిల్లాలోని 44వ నంబర్​నేషనల్​హైవేపై మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద అండర్​ పాస్​ నీటమునిగింది. దీంతో హైదరాబాద్​ – నాగపూర్​రూట్ లో ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​అయింది. 65వ నంబర్​నేషనల్​హైవే మీద  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు వద్ద హైదరాబాద్ – ముంబై రూట్​లో దాదాపు మూడు గంటల పాటు వెహికల్స్​అడుగు ముందుకు కదలలేదు. నేషనల్​ హైవే 161పై మెదక్​ జిల్లా బొడ్మట్​పల్లి వద్ద వరద నీరు చేరడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ​జామ్​ అయింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు నుంచి పుల్కల్​ వెళ్లే రూట్​లో రోడ్డు తెగిపోయి, ఎనిమిది గ్రామాలకు లింక్​ కట్ అయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ వాగు ఉధృతితో నిజాంపేట, చల్మెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  జనగామ– సూర్యాపేట రోడ్డుపై నెల్లుట్ల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కల్వర్టు తెగి లారీ దిగబడడంతో రాకపోకలు బంద్​చేశారు. వనపర్తి జిల్లాలో మంగళవారం కురిసిన  భారీ వర్షాలకు చాలా రోడ్లు తెగిపోయాయి. 51 అండర్​లెవల్​బ్రిడ్జి ల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా వనపర్తి–ఆత్మకూరు,వనపర్తి–పెబ్బేరు రోడ్లపై రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేసింది. సూర్యాపేట జిల్లాలోని  పలు మండలాల్లో చెరువులు నిండి అలుగు పోస్తుండడంతో రోడ్లపై నీళ్లు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద మూసీ వరద పెరిగి హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పైకి రావడంతో సుమారు గంటసేపు వెహికల్స్​ఆపేశారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని కొత్తగూడెం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఖమ్మం జిల్లాలోని అనేక మండలాల్లో వరదల కారణంగా బాణాపురం– వల్లభి, చిరుమర్రి– వీవీకే పురం, కల్లూరు– తూర్పులోకవరం, ఖమ్మం– పందిల్లపల్లి , మధిర– రాయపట్నం, బోనకల్– అల్లపాడు మధ్య రాకపోకలు నిలిచాయి. ములుగు జిల్లా, వాజేడ్ మండలంలో చికుపల్లి గ్రామం వద్ద 63 నంబర్ జాతీయ రహదారి కుంగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెం వద్ద నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ కట్టకు బుంగ పడింది. ఖమ్మం-సూర్యాపేట మధ్య నాయకన్​గూడెం దగ్గర ఫోర్​లేన్​హైవే కోసం కడుతున్న బ్రిడ్జి దగ్గరే కాల్వ కట్టకు బుంగ పడడం, ఇది పెద్దగా మారి గండి పడే ప్రమాదం ఉండడంతో కాంట్రాక్టర్​ తో పాటు అధికారులు కూడా బుంగను పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కూలిన ఇండ్లు

వర్షాలు, వరదల కారణంగా సిద్దిపేట జిల్లాలో 100 ఇళ్లు, మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో 29 ఇళ్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 20 ఇండ్లు కూలిపోయాయి. వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​ మండలం శ్రీరాములపల్లిలో 8 ఇండ్లు పూర్తిగా, 30 ఇండ్లు పాక్షికంగా, ఖమ్మం జిల్లాలో నాలుగు ఇండ్లు పూర్తిగా, 24 ఇండ్లు, నాగర్​కర్నూల్​ జిల్లాలో103 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆఫీసర్లు చెప్పారు.

వాగులు పొంగి.. వరదలో చిక్కి..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంగెం గ్రామంలో ఉపాధి కోసం ఏపీ​ నుంచి వచ్చిన ఒకే ఫ్యామిలీలోని ఏడుగురు వరదలో చిక్కుకున్నారు. కలెక్టర్​ హన్మంతరావు పర్యవేక్షణలో రెస్క్యూ టీం వారిని కాపాడింది. ఘనపూర్​ ఆనకట్ట పొంగిపొర్లి మంజీరా నది పాయలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మెదక్​ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ కల్వర్టు వద్ద మంగళవారం రాత్రి ఇన్నోవా వరదలో కొట్టుకుపోగా, అందులో చిక్కుకున్న నలుగురిని పోలీసులు, స్థానికులు ఒడ్డుకు చేర్చారు. జనగామ–సూర్యాపేట రోడ్డుపై గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు ఏమీ కాలేదు. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుకు ముప్పు ఉండడంతో రత్నపురం గ్రామం వద్ద వాగుకు గండి కొట్టి వరదను మళ్లిస్తున్నారు. ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం పరిశీలించి, మూసీ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించారు.

Latest Updates