సూర్యాపేట‌లో ప‌రిస్థితి త్వ‌ర‌లోనే అదుపులోకి వ‌స్తుంది: సీఎస్

సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 26 మంది వైర‌స్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలు మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ‌జిల్లాలో ప‌ర్య‌టించి పరిస్థితిని సమీక్షించారు. వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్‌ ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సూర్యాపేట లో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించామ‌ని, దీనిపై మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అదనపు అదికారులను నియమించామ‌ని చెప్పారు.

కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామ‌ని, ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశామ‌న్నారు. ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఎవరు వచ్చారనే దానిపై సర్వే చేయాలని నిర్ణయించామ‌న్నారు. క్వారెంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే దానిపై సూచనలు చేశామ‌ని చెప్పారు.

క‌రోనా నియంత్ర‌ణ కోసం జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వాళ్లకు పూర్థిస్థాయిలో మద్ధతుగా ఉంటామ‌ని సీఎస్ అన్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామ‌ని, ప‌రిస్థితి త్వ‌ర‌లో అదుపులోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప‌క్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండొద్దు: డీజీపీ

సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్ గా క్షేత్రస్థాయిలో సందర్శించామ‌ని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు . జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ ఇవ్వడానికే తాము వచ్చామని చెప్పారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న‌ద‌ని, సూర్యాపేట జిల్లాలో కూడా త్వ‌ర‌లోనే క‌రోనా మహమ్మారిని కట్టడి చేస్తామని ఆయ‌న అన్నారు .

పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడద‌ని డీజీపీ అన్నారు. కంటైన్మెంట్ ఏరియాలోకి బయటివారు రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. భవిష్యత్ లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామ‌న్నారు. అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని,. అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు.

Latest Updates