చైనా కంపెనీలతో స్పాన్సర్‌‌షిప్స్‌ రద్దు చేసుకోండి.. లేదా ఐపీఎల్ బాయ్‌కాట్

బీసీసీఐకు స్పష్టం చేసిన సీటీఐ

న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియా సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ప్రొడక్ట్స్‌, యాప్స్‌ను బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ క్రికెట్ పైనా పడింది. చైనా కంపెనీలతో స్పాన్సర్‌‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ‘ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (సీటీఐ) బీసీసీఐని కోరింది. ఈ మేరకు చైనా కంపెనీలతో ఒప్పందాలను ముగించాలని కోరుతూ బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి సీటీఐ కన్వీనర్ బ్రిజేశ్ గోయల్ ఓ లెటర్‌‌ పంపారు. ఒకవేళ బీసీసీఐ చైనా కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేసుకోకపోతే.. దేశంలోని ట్రేడర్స్ అందరూ కలసి ఐపీఎల్‌తోపాటు మిగతా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేస్తామని ఈ లెటర్‌‌లో గోయల్ హెచ్చరించారు.

గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఐపీఎల్ స్పాన్సర్ వివోను ఆ హక్కుల నుంచి తొలగించాలని బీసీసీఐని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇండియా–చైనా బార్డర్ వివాదం నేపథ్యంలో ఐపీఎల్‌కు సంబంధించిన వివిధ స్పాన్సర్‌‌షిప్ డీల్స్‌పై వచ్చే వారంలో చర్చిస్తామని శుక్రవారం గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. చైనా ఉత్పత్తులు, స్పాన్సర్స్‌పై ఏకరీతిన నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తేనే.. వివోను టైటిల్ స్పాన్సర్‌‌గా తొలగిస్తామని బీసీసీఐ రీసెంట్‌గా స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్‌‌లో జరిగిన వేలంలో రాబోయే 5 ఏళ్లకు ఐపీఎల్ స్పాన్సర్‌‌షిప్ హక్కులను రూ.2,199 కోట్లు చెల్లించి వివో దక్కించుకుంది. వివోతోపాటు ఐపీఎల్ స్పాన్సర్స్‌లో పేటీఎం కూడ ఒకటి. ఈ కంపెనీలో ప్రముఖ చైనా కంపెనీ అలీబాబా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.