ఈసారీ మక్క మస్తుగనే.. సీఎం వేయొద్దన్నా వేల ఎకరాల్లో సాగు

సీఎం ఒక్క ఎకరాలో వేయొద్దన్నా
ఇప్పటికే 40 వేల ఎకరాల్లో సాగు
సిద్దిపేట జిల్లాలోనే 2,048 ఎకరాల్లో
సీజన్‌ అయిపోయే లోపు పెరిగే చాన్స్‌
38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..
వ్యవసాయ శాఖ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: రైతులు ఈ ఏడాది కూడా మక్కను మస్తుగనే పండిస్తున్నరు. ఈ వానాకాలంలో ఒక్క ఎకరాలో కూడా మక్క వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పినా తమ నేలకు అనువైన పంటనే సాగు చేస్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40 వేల ఎకరాల్లో మక్క పంట వేశారు. సిద్దిపేట జిల్లాలోనే 2,048 ఎకరాల్లో పంట సాగైంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ రిపోర్టు వెల్లడించింది. రాష్ట్రంలో వానలు, జల వనరులు, పంటల సాగు, తెగుళ్లు, నివారణపై ఆ శాఖ ప్రతి బుధవారం రిపోర్టు రెడీ చేస్తుంటుంది.

మక్కేస్తే ఎంఎస్‌పీ కష్టమన్నరు

మక్కలు సాగు చేస్తే ధర రాదని, ఎంఎస్‌పీకి కొనుగోలు చేసే అకాశం ఉండదని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. రాష్ర్టవ్యా ప్తంగా వ్యవసాయ శాఖ కూడా ఇదే చెప్పింది. రైతులు మాత్రం తమకున్న అనుభవంతో తమ భూములకు అనువైన పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది ఈ టైమ్‌కు 1.44 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఇప్పుడు 40,061 ఎకరాల్లో వేశారు. కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోనే 2 వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కామారెడ్డిజిల్లాలో 13 వేలు, నిజామాబాద్ జిల్లాలో 10 వేలు, జగిత్యాలలో 4,732 వేలు, నిర్మల్ జిల్లాలో 3,644 ఎకరాల్లో పంట వేశారు. సీజన్‌ మొదలై నెల రోజులయింది. ఇంకో నెల దాకా విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుంది. దీంతో సాగు మరింతగా పెరగొచ్చని వ్యవసాయ శాఖ వర్గాలంటున్నాయి. మొక్కజొన్న పంటల సాగుకు రాష్ర్టంలో 11.76 లక్షల ఎకరాలు అనువుగా ఉంటాయి.

వరి 1.60 లక్షల ఎకరాల్లో..

రాష్ర్టంలో ఈ ఏడాది పత్తి ప్రధాన పంటగా మారుతోంది. షరతుల సాగులో భాగంగా ఈ ఏడాది 55 లక్షల ఎకరాల్లో పత్తి వేయించాలని సర్కారు నిర్ణ‌యించగా.. ఆ ప్లాన్ ప్రకారమే పత్తి సాగయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఇప్పటివరకు 15.94 లక్షల ఎకర్లాలోనే పంట వేస్తే ఈ ఏడాది ఇప్పటికే 38.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు 1.60 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. గతేడాది ఈ టైమ్‌ నాటికి 50 వేల ఎకరాల్లోనే నాట్లేశారు. ఈ ఏడాది 12.51 లక్షల ఎకరాల్లో కందులు సాగుపై సర్కారు నిర్ణ‌యం కాగా ఇప్పటికే 5.68 లక్షల ఎకరాల్లో వేశారు. గతేడాది ఈ రోజు వరకు 91 వేల ఎకరాల్లో కందులేశారు. సోయాబీన్ కూడా గతేడాది లక్షల ఎకరాల్లోనే సాగుకాగా ఇప్పుడు 3.51 లక్షల ఎకరాల్లో వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates