శ్రీనగర్​లో మళ్లీ ఆంక్షలు

శ్రీనగర్​/జమ్మూ: కాశ్మీర్​ వ్యాలీలోని అతిపెద్ద సిటీ శ్రీనగర్​లో ఆదివారం నుంచి మళ్లీ ఆంక్షలు విధించారు. ఆర్టికల్​ 370 రద్దును నిరసిస్తూ శ్రీనగర్​ ఓల్డ్​ సిటీలో స్థానిక యువకులు చేపట్టిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనగర్​తోపాటు వ్యాలీలోని 10 జిల్లాల్లో శనివారం కర్ఫ్యూ ఎత్తేశారు. దీన్ని అదనుగా తీసుకున్న మూకలు.. సెక్యూరిటీ సిబ్బందిపై రాళ్లు, కర్రలు విసిరారని అధికారులు చెప్పారు. కాగా, నిరసన కారులపై పోలీసులు టియర్​గ్యాస్​ ప్రయోగించారని, ఈక్రమంలో డజనుమందికిపైగా యువకులు గాయపడ్డారని ‘రాయిటర్స్​’ వార్తా సంస్థ పేర్కొంది. ఇటు జమ్మూ డివిజన్​లోని ఐదు జిల్లాల్లో ఆదివారం కమ్యూనికేషన్ వ్యవస్థ​ స్తంభించింది. అందుబాటులోకొచ్చిన కొద్దిగంటలకే ఫోన్​ సర్వీసులు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపం వల్లే కమ్యూనికేషన్​కు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. ‘‘ఆంక్షల కారణంగా ఇంటికే పరిమితమైపోయిన స్థానికులకు బయట ఏం జరుగుతుందో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీలైనంత తొందరగా కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం’’అని గవర్నర్​ సలహాదారు కే.విజయ్​కుమార్​ మీడియాతో అన్నారు. ఇదిలాఉంటే, హజ్​ యాత్రను విజయవంతంగా ముగించుకుని శ్రీనగర్​కు తిరిగొచ్చిన 304 మందికి ఎయిర్​పోర్టులో అధికారులు స్వాగతం పలికారు. సోమవారం నుంచి జమ్మూ డివిజన్​లో స్కూళ్లు, కాలేజీలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. లడక్​ ఎంపీ జమ్యంగ్ నమ్‌‌గ్యల్ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం లడఖ్‌‌కు ఇంపార్టెన్స్​ ఇవ్వకపోవడం వల్లే దెమ్‌‌చోక్ సెక్టర్ వరకు చైనా ఆక్రమించుకుందని అన్నారు.

కాంగ్రెస్​ దారి తప్పింది: హుడా

జమ్మూకాశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్​ను మాజీ సీఎం, భూపేంద్ర సింగ్​ హుడా, ఆయన కొడుకు దీపేంద్ర సింగ్​ హుడా తప్పుబట్టారు. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, మోడీని మెచ్చుకున్నారు. రోహ్​తక్​లో మీడియాతో మాట్లాడిన భూపేంద్ర హుడా..‘‘కాశ్మీర్​ విషయంలో కాంగ్రెస్​ పూర్తిగా దారితప్పింది’’అని చెప్పారు. తర్వాత కాసేపటికే ఆయన కొడుకు దీపేంద్ర హుడా కూడా స్పందించారు. ‘‘మోడీ సర్కార్​ ఆర్టికల్​ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తాను. కానీ వాళ్లు అనుసరించిన పద్ధతి సరిగాలేదు. ఈ అంశాన్ని పొలిటిసైజ్​ చేయడం కరెక్టకాదు’’అని దీపేంద్ర హుడా అన్నారు.

 

Latest Updates