సీఎం కారులో రూ.1.8 కోట్లు : చౌకీదార్‌ దొంగ అన్న కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్ : ఎలక్షన్స్ దగ్గరపడుతున్నా కొద్దీ నోట్ల కట్టలు కుప్పలుగా దొరుకుతున్నాయి. మంగళవారం రాత్రి అరుణాచల్ ప్రదేశ్ సీఎం కారులో రూ.1.8 కోట్లు దొరకడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు.  ఈ మేరకు ఓ ప్రెస్‌ నోట్‌  విడుదల చేశారు. ‘మంగళవారం అర్ధరాత్రి జరిపిన సోదాల్లో అరుణాచల్‌ ప్రదేశ్ సీఎం పెమా ఖందూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తాపిర్‌ గావ్‌ వెళ్తున్న కాన్వాయ్‌ లోని ఓ కారులో రూ. 1.8కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ డబ్బును పాసిఘాట్‌ లోని సియాంగ్‌ గెస్ట్‌ హౌస్‌ కు తరలిస్తున్నట్లు తెలిసింది.

యువ కాంగ్రెస్‌ కు చెందిన కొందరు కార్యకర్తల ఫిర్యాదుతో కాన్వాయ్‌ లోని వాహనాలను తనిఖీ చేయగా.. ఈ విషయం బయటపడిందని’  ప్రెస్‌ నోట్‌ లో తెలిపారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అరుణాచల్‌ప్రదేశ్‌ లోని పాసిఘాట్‌లో ప్రధాని మోడీ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభకు వచ్చే ప్రజలకు డబ్బు పంచేందుకే ఈ నగదును తరలించే ఏర్పాట్లు చేసి ఉంటారని కాంగ్రెస్‌ తెలిపింది. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించింది. దీనిపై ఎన్నికల సంఘం గానీ, ఈడీ గానీ ఎందుకు చర్యలు చేపట్టట్లేదని సీరియస్ అయ్యింది. చౌకీదార్‌ దొంగ అని ఈ ఘటనతో మరోసారి రుజువైందని విమర్శలు చేసింది కాంగ్రెస్.

Latest Updates