భూమిలోని వేడితో కరెంట్​

జియోథర్మల్‌‌ ప్రాజెక్టుకు
ఈడెన్​ సంస్థ సిద్ధం
4.5 కిలోమీటర్ల లోతుకు పైపులేస్తామన్న కంపెనీ

భూమి లోపలున్న వేడిని వాడుకొని కరెంటు ఉత్పత్తి చేసేందుకు ఈడెన్‌‌ సంస్థ రెడీ అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన రూ.150 కోట్లు సిద్ధమయ్యాయని చెప్పింది. ఇటలీలోని సెయింట్‌‌ ఆస్టెల్‌‌లో బేస్‌‌ ఏర్పాటులో సంస్థ బిజీగా ఉంది. ఇక విద్యుత్‌‌ ఉత్పత్తే లేటంటోంది. బేస్‌‌లోని గ్రానైట్‌‌ క్రస్ట్‌‌లో సుమారు 4.5 కిలోమీటర్ల మేర డ్రిల్‌‌ చేసి పైపులేస్తామని చెప్పింది. ఒక్కో బావి సైజు 25 సెంటీమీటర్లేనని, ఓ మీడియం పిజ్జా సైజులో ఉంటుందని పేర్కొంది. బావులేశాక ఓ ఇన్సులేటెడ్‌‌ పైపును 3 కిలోమీటర్ల వరకు పంపి అక్కడ వేడి ఎంత మోతాదులో ఉందో తెలుసుకుంటామంది. ఆ తర్వాత ఓ పైపు నుంచి చల్లని నీటిని పంపుతామని, భూమిలోని వేడి వల్ల ఆ నీళ్లు మసిలి బయటకొస్తాయని వివరించింది. ఆ వేడి నీటిని హీట్‌‌ ఎక్స్‌‌చేంజర్‌‌లోకి పంపుతామని, అక్కడ వేడి కరెంటుగా మారుతుందని చెప్పింది.

భూమిలోని వేడితో మస్తు కరెంటు

‘సూర్యశక్తితో మస్తు కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. గాలితోనూ విద్యుత్‌‌ను ఉత్పత్తి చేసే శక్తి ఉంది. కానీ ఈ రెండు పద్ధతుల వల్ల వచ్చే కరెంటును స్టోర్‌‌ చేసుకునే బ్యాటరీ టెక్నాలజీ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. అందుకే రెన్యువబుల్‌‌ ఎనర్జీ ఉత్పత్తిలో మనం వెనకబడిపోతున్నాం. దీనికి సరైన జవాబు మన కాళ్ల కిందే ఉంది. భూమిలోని వేడిని వాడుకొని కావాల్సినంత కరెంటు ఉత్పత్తి చేయొచ్చు’ అని ప్రాజెక్టు కో ఫౌండర్‌‌ టిమ్‌‌ స్మిత్‌‌ అన్నారు. ప్రభుత్వం, యూరోపియన్‌‌ యూనియన్‌‌, కార్న్‌‌వాల్‌‌ కౌన్సిల్‌‌, ప్రైవేట్‌‌ ఇన్వెస్టర్లు సాయం చేశారని చెప్పారు. ప్రాజెక్టు మొదలవుతున్నందుకు ఉత్సాహంగా ఉందని ఈజీఎల్‌‌ డైరెక్టర్‌‌ అగస్టా అన్నారు. భూమిపై తక్కువ స్పేస్‌‌ను వాడుకొని విద్యుత్‌‌ను ఉత్పత్తి చేయగల ఏకైక ప్రక్రియ ఇదేనని చెప్పారు. జియో థర్మల్‌‌ పద్ధతి వల్ల ఉపయోగాలు చెప్పి పెట్టుబడి పెట్టడానికి ఎంకరేజ్‌‌ చేస్తామన్నారు.

Latest Updates