
కేంద్రం పెంచిన జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని అంగన్‍వాడీ టీచర్లు వాపోతున్నారు. పెంచిన వేతనాలను చెల్లించాలంటూ సోమవారం నుంచి ఆందోళన బాట పట్టనున్నారు. అంగన్‌వాడీ టీచర్ల జీతాలను కేంద్రం అక్టోబర్‌లో పెంచింది. రాష్ట్రంలో పని చేస్తున్న 70 వేల మంది అంగన్‍వాడీ టీచర్లు, ఆయాలకు పెంపు లబ్ది అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను బాగా పెంచిందని, తిరిగి పెంచవలసిన అవసరం లేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో అంగన్‌వాడి సిబ్బంది నెలకు దాదాపు రూ. 10 కోట్లు నష్టపోతున్నారంటున్నారు.
గతంలో అంగన్‍వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200, కేంద్ర ప్రభుత్వం రూ.3000 కలిపి రూ.4200 గౌరవ వేతనం ఇచ్చేవారు. మినీ అంగన్‍వాడీలకు, ఆయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ. 1500 చొప్పున రూ.3000 ఇచ్చేవి. 2015 లో రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో జీతాలు పెంచి అంగన్‌వాడీ టీచర్లకు రూ. 10,500, మినీ అంగన్‍వాడీలకు, ఆయాలకు రూ. 6000 వేలు ఇస్తున్నది. 2018 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం టీచర్లకు రూ. 1500, మినీ అంగన్‍వాడీలకు, అయాలకు రూ.1250 జీతం పెంచింది. కేంద్రం పెంచిన మేరకు రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇవ్వడంలేదని అంగన్‍వాడీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
70 వేల మందికి నష్టం…
తెలంగాణలో 35 వేల అంగన్‍వాడీల్లో 70 వేల మంది టీచర్లు, ఆయాలు పని చేస్తున్నారు. కేంద్రం పెంచిన మేరకు జీతాల్లో కలపకపోవడంతో ప్రతినెల తాము రూ. పది కోట్ల వరకు నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెంచకముందే రెండు దఫాలుగా జీతాలు పెంచామని, మళ్లీ పెంచలేమని ప్రభుత్వం సంఘాలకు తేల్చిచెప్పడంతో ఆందోళనలకు సిద్దమవుతున్నారు. మూడు రోజుల పాటు ప్రాజెక్టు ఆఫీసుల దగ్గర నిరసన దిగుతున్నట్లు చెప్తున్నారు.