నా గుండె చీల్చి చూస్తే మోడీ కనిపిస్తారు: చిరాగ్ పాశ్వాన్

ప్రధాని నరేంద్ర మోడీకి తాను హనుమంతుడి లాంటి వాడినని, తన గుండె చీల్చి చూస్తే మోడీనే కనిపిస్తారని లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. మోడీని కళ్లు మూసుకుని నమ్మేంత వీరాభిమానం తనకు ఉందని చెప్పారు. నవంబర్‌లో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో కలిసి తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కావాలనే తనకు వ్యతిరేకంగా బీజేపీ పని చేసేలా ఆఖరికి ప్రధాని మోడీపై సైతం ఒత్తిడి తీసుకుని వస్తున్నారని ఆరోపించారు చిరాగ్ పాశ్వాన్. శుక్రవారం పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ బీహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తోంది. అయితే నితీశ్ కుమార్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, తన తండ్రి దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన సమయంలో కనీసం పరామర్శ కూడా చేయలేదని చెబుతున్నారు చిరాగ్. తన తండ్రిని సీఎం అవమానించారని, ఇప్పుడు బీజేపీ నేతలతో సైతం తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఎన్డీఏ మిత్రపక్షాలు రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు పోటీ చేయడం కొత్తేమీ కాదని, జార్ఖండ్‌లో నితీశ్ పార్టీ జేడీయూ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిందని గుర్తు చేశారు. అయితే తాను ఎన్డీఏలోనే కొనసాగుతున్నానని, బీహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ పెద్దలకు చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. చిరాగ్ అబద్ధాలు చెబుతున్నారని, తన మైలేజ్ కోసం బీజేపీని వాడుకుంటున్నారని, బీజేపీకి ఎటువంటి బీ టీమ్స్ అక్కర్లేదని చెప్పారు.

గుండె చీల్చుకోవడానికీ సిద్ధమే

జవదేకర్ వ్యాఖ్యలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్.. తాను మోడీకి మూఢ భక్తుడినని, రాముడికి హనుమంతుడు ఎలానో.. మోడీకి తాను అలాంటి వాడినని చెప్పారు. తాను మోడీ ఫొటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తన గుండె చీల్చి చూస్తే మోడీనే కనిపిస్తారని చెప్పారు. అవసరమైతే తన గుండె చీల్చుకోవడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. తాను ఎప్పటికీ మోడీకి విశ్వాసపాత్రుడినేనని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, జేడీయూతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ.. నవంబర్ 10న రాష్ట్రంలో ఏర్పడేది ఎల్జేపీ, బీజేపీల కూటమి ప్రభుత్వమేనని చెప్పారు.

Latest Updates