లక్కీ డ్రాలో కారు గిఫ్ట్.. రూ.49,000 కట్టి మోసపోయిన వ్యక్తి

కర్నూల్: “హలో సర్.. నమస్తే.. మీరు స్నాప్ డీల్ లో ఓ బంపర్ గిఫ్ట్ గెలుచుకున్నారు. మీరు ఆర్డర్ పెట్టిన సెల్ నెంబర్ కి లక్కీ డ్రాలో ఒక కాస్ట్లీ కారు గిఫ్ట్ గా తగిలింది. మీరు ఆ కారును పొందాలంటే కేవలం రూ.15,000/- మాత్రం మాకు పే చేస్తే చాలు. ఒకవేళ మీకు ఆ కారు వద్దనుకుంటే.. ఆ కారు విలువ మొత్తాన్ని మీకు మా కంపెనీ నుండి మీ బ్యాంకు అకౌంట్ కు పంపిస్తాం. మీ అకౌంట్ కు పంపించాలంటే మాకు ట్యాక్స్ పడుతుంది కాబట్టి కొంత మొత్తాన్ని చెల్లించాలి ” అని సైబర్ నేరగాళ్లు  ప్రజలను మోసం చేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి నంద్యాల, నూనెపల్లెకు  చెందిన రేవంత్ అనే వ్యక్తి నుండి రూ.49,000 నష్టపోయాడు.

కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప.. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “ స్నాప్ డీల్ లో రేవంత్ టీ షర్ట్ కొరకు ఆర్డర్ చేశాడు. అయితే ఆ టీ షర్టుకు ఆర్డర్ పెట్టిన సెల్ నెంబర్ కి లక్కీడ్రాలో కారు గెలుచుకున్నారని సైబర్ నేరగాళ్ళు మెసేజ్ చేసి ఫోన్ చేశారు. ఆ కారును పొందాలంటే కేవలం రూ. 15,000/- మాత్రమే  కట్టాలని చెప్పారు. ఆ ఆఫర్ కి తొందరపడి ఆ డబ్బును కట్టేశాడు రేవంత్. ఆ తర్వాత తనకు కారు అవసరం లేదని వారికి చెప్పగా..   ఆ కారు విలువ మొత్తం నగదును రూ. 8,50,000  మీకు మా కంపెని నుండి మీ ఖాతాకు పంపిస్తామని ఆ నేరగాళ్లు చెప్పారు. ఆ  పెద్ద మొత్తాన్ని మీ ఖాతా కు పంపించాలంటే కొంత ట్యాక్స్ కూడా పడుతుందని చెప్పి దానికి రూ. 8,500/- మరలతిరిగి ఇంకా ఎక్స్ ట్రా సర్వీస్ చార్జీల క్రింద  రూ. 25,500/- కట్టించుకున్నారు. ఇలా మూడు సార్లు మొత్తంగా రూ.49,000 ని రేవంత్ దగ్గర నుంచి వసూలు చేసిమోసం చేశారు. పలుమార్లు ఫోన్ లు చేసినా వారి నుండి సమాధానం లేకపోవడంతో.. మోసపోయానని గ్రహించిన బాధితుడు నంద్యాల మూడవ  పట్టణ పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్నెట్ వినియోగం విరివిగా పెరిగిన ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని, మోసపూరిత ప్రకటనలను నమ్మకండని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరారు.

Latest Updates