జాగ్రత్త..ఓటీపీ లేకున్నా క్యాష్ మాయం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్​ను టార్గెట్ చేసిన సైబర్ దొంగలు కాల్ చేసి ఓటీపీ లేకుండానే డబ్బు కొట్టేస్తున్నారు.  దయాకర్ ప్రైవేట్ ​లెక్చరర్.  బుధవారం రాత్రి 12.30 గంటలకు ఆయనకు ఓ కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు. ‘మీ క్రెడిట్ కార్డుతో మరొకరు షాపింగ్ చేశారు.  మరిన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి.  కార్డును బ్లాక్ చేస్తాం’ అని పేర్కొన్నారు. అందుకోసం కార్డు సీరియల్ నంబర్ తో పాటు డీటెయిల్స్ చెప్పాలన్నారు.  నెల రోజుల నుంచి షాపింగ్ చేయని దయాకర్ అలర్ట్ అయ్యాడు. అకౌంట్ చెక్ చేసుకునేందుకు కాల్ కట్ చేశాడు. ఆలోపే అతడి క్రెడిట్ లిమిట్ నుంచి రూ.8,338 గుర్తుతెలియని ఇ– వ్యాలెట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దయాకర్ వెంటనే  క్రెడిట్ కార్డు బ్లాక్ చేసి బ్యాంక్ కస్టమర్ కేర్ కు కంప్లయింట్ చేశాడు. ఇలాంటి ఫోనే వెంగళ్ రావు నగర్ కి చెందిన వెంకటేశ్వర్ రావు కూడా వచ్చింది. అతడి  క్రెడిట్ కార్డ్ నుంచి ‘విష్’ అనే పేరున్న ఇ– వ్యాలెట్ కి రూ.10వేలు, గూగుల్ యూట్యూబ్ పేరుతో ఉన్న ఇ– వ్యాలెట్ కి రూ.35 వేలను సైబర్ క్రిమినల్స్​ ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. బాధితులిద్దరూ గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఓటీపీ లేకుండా డబ్బు ఎలా ట్రాన్స్ ఫర్ అయ్యిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. మాస్టర్ కార్డ్, వీసా ఇంటర్నేషన్ కార్డుల నుంచి మాత్రమే ఇలాంటి  ట్రాన్జాక్షన్స్ జరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్తున్నారు. ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగిన మూడ్రోజుల్లోపే బాధితులు కంప్లయింట్ చేస్తే సంబంధిత బ్యాంకులు మనీ రీఫండ్ చేసే అవకాశాలున్నాయని తెలిపారు

Latest Updates