గడ్డం నూనె కోసం ఆర్డరిస్తే.. సైబర్ దొంగలు తగిలిండ్రు

హైదరాబాద్, వెలుగు: దోస్తుగాళ్లందరూ గడ్డాలు పెంచుతుండ్రు. నాకేమో అంతంతే వస్తున్నది. తోటో ళ్లు ఎక్కిరిస్తుంటే నామోషీగా అన్పిస్తున్నది. అందుకే.. వాళ్ల కంటే స్టైల్ గా.. హీరో లెక్క గడ్డం పెంచాలనుకున్నడు. ఆన్ లైన్ లో వెతికి ‘బియర్డ్ ఆయిల్’ కోసం ఆర్డర్ చేసిండు. కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. దీపావళి ధమాకా పేరుతో మెసేజ్ వచ్చింది. రూ.14 లక్షల కారు గిఫ్ట్ గా గెలుచుకున్నవంటూ ఊరించారు. ఆ స్టూడెంట్ ను మభ్యపెట్టిన సైబర్ దొంగలు రూ. 86 వేలు దోచేసిండ్రు! చివరికి మోసపోయానని తెలుసుకున్న అతడు శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

స్నాప్ డీల్ లో ఆర్డర్ చేస్తే..

గోషామహల్ కు చెందిన మనీశ్(పేరు మార్చాం) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్ తో పాటు తను కూడా పెద్ద గడ్డం పెంచి స్టైలిష్ లుక్ ఇద్దామనుకున్నాడు. స్నాప్ డీల్ ఆన్ లైన్ షాపింగ్ లో  బియర్డ్ ఆయిల్ కోసం సెర్చ్ చేశాడు. గతేడాది అక్టోబర్10న రూ.400 విలువైన ఓ ఆయిల్ బాటిల్ ను ఆర్డర్ చేశాడు. కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది. అయితే అక్టోబర్23న మనీశ్ మొబైల్ నంబర్ కి ఓ మెసేజ్ వచ్చింది. ‘స్నాప్ డీల్ దీపావళి బంపర్ ధమాకాలో రూ.14.80 లక్షల మహీంద్రా ఎక్స్ యూవీ500 కారు గెలుచుకున్నారు కంగ్రాట్స్’ అని అందులో ఉంది. కారు లేదా క్యాష్ తీసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజ్ రూ.6,500, టెంపరరీ రిజిస్ట్రేషన్ పేపర్స్ కోసం రూ.8,500 కట్టాలన్నారు. మరిన్ని వివరాలకు 07044599353, 09973779534 ఫోన్ నంబర్స్ కు కాల్ చేయాలని సూచించారు.

ఆ ఫీజులు.. ఈ ఫీజులు అంటూ..

మెసేజ్ చూసి మనీశ్ ఖుషీ అయ్యిండు. తల్లికి, ఫ్రెండ్స్ కూ చెప్పుకున్నాడు. గిఫ్ట్ ను క్లైమ్ చేసుకోవాలంటూ 7250005985, 7258917516 నంబర్స్ నుంచి అతడికి కాల్స్ వచ్చాయి. కారు లేదా క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలని మస్కా కొట్టారు. తనకు క్యాషే కావాలని మనీశ్ చెప్పాడు. సైబర్ నేరగాళ్ళు చెప్పినట్లు రూ.6,500 డిపాజిట్ చేశాడు. తర్వాత ఆ ఫీజులు, ఈ ఫీజులు అంటూ మళ్లీ మళ్లీ డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు లేకపోవడంతో అక్క పెళ్లికి తెచ్చిన బంగారం కుదువబెట్టి మరీ మొత్తం రూ. 86 వేలు డిపాజిట్ చేశాడు. వాళ్లు అడుగుతూనే ఉండటంతో మనీశ్ కు అనుమానం వచ్చింది. దీంతో షాహినాత్ గంజ్ పోలీసులను ఆశ్రయించాడు.

సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు

సైబర్ క్రైమ్ కాడంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గత నెల తన అక్క పెళ్లి ఉండటంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదును వాయిదా వేశాడు. సైబర్ నేరగాళ్లు మళ్లీ వారం రోజులుగా మనీశ్ కు ఫోన్ చేయడం ప్రారంభించారు. స్నాప్ డీల్ ఆన్ లైన్ షాపింగ్ హెడ్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ అనిల్ నాయక్ నుంచి వచ్చినట్లుగా గురువారం గిప్ట్ కూపన్ పంపారు. దీంతో అతడు శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Latest Updates