గ్రామంలో సైబర్ క్రిమినల్స్ దోపిడీ

సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న హ్యాకర్లు కొత్తగా గ్రామాల బాట పట్టారు. ఇంతకు ముందు ఫోన్లో అడిగి ఓటీపీ నంబర్ తో డబ్బులు తీసుకోవడం, బహుమతుల పేరుతో ప్రజలను మోసం చేయడం చూసాం కానీ, ఏకంగా గ్రామంలోకి వెళ్లి వారి ఆదార్ కార్డు అప్డేట్ అంటూ డబ్బులు డ్రా చేసిన ఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఆలస్యంగా బయటికొచ్చింది.

గ్రామ ప్రజలకు మాయమాటలు చెప్పిన హ్యాకర్లు వారి వద్ద నుంచి డబ్బులు మాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తగా జనగామ జిల్లాలో కలిసింది. నమిలిగొండ గ్రామం జనగామ జిల్లాలో కలిసినందువల్ల జిల్లా పేరును ఆధార్ కార్డులో మారుస్తున్నామని..  కొందరు ఆ గ్రామ సర్పంచును కలిశారు. వారి గురించి ఆరా తీసిన సర్పంచ్.. వారిని నమ్మి, గ్రామంలో దండోరా వేయించారు.

ఆ తర్వాత వరుసగా 4 రోజులు హ్యాకర్లు ప్రజల నుంచి ఆధార్ నెంబర్లు తీసుకున్నారు. అందరి ఆధార్ నెంబర్లతో పాటు వారి చేతి ముద్రలు కూడా సేకరించారు. అలాగే ప్రజలందరికీ పీఎం నరేంద్ర మోదీ డబ్బులు వేస్తున్నారని చెప్పడంతో అందరూ నమ్మి వారి ఆధార్ నెంబర్ తో పాటు వేలి ముద్రలు ఇచ్చారు. వారి నెంబర్లను తీసుకున్న హ్యాకర్లు వెంటనే వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశారు. దీంతో ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతా నుంచి ఒక్కసారి వేలిముద్రలు వేస్తే 600, రెండుసార్లు వేస్తే 1200 రూపాయలు కట్ అయ్యాయి.

ఖాతా నుండి పైసలు కట్ అయినట్లు గమనించిన  ప్రజలు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. దాదాపుగా 5 లక్షల రూపాయల స్కాం జరిగినట్టు సమాచారం. అయితే మళ్లీ తమ అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అవుతాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates