ఇంట‌ర్నెట్ కాల్స్ వ‌ల‌నే నేరాలు పెరుగుతున్నయి

రోజురోజుకు నేరాలు చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు . ఇంట‌ర్‌నెట్ కాల్స్ తో మాయ చేస్తూ.. ప‌లు నేరాలకు ఒడిగడుతున్నారు. ఈ కాల్స్ ను ట్రేస్ చేయడం పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారింది. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో బాలుడు దీక్షిత్ కిడ్నాప్‌, హత్య ఉదంతం లో కూడా నిందితులు దారుణానికి పాల్ప‌డ్డ త‌ర్వాత‌.. నెట్ కాల్స్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి, వారిని మ‌భ్య పెట్టారు.

భవిష్యత్తులో నేరగాళ్లు అందరూ ఇంటర్నెట్ కాల్స్ ద్వారానే నేరాలకు పాల్పడతారా..?? ఈ ఇంటర్నెట్ కాల్స్ ని సైబర్ క్రైమ్ ఏ విధంగా గుర్తిస్తుంది..? వీటిని అరికట్టే అవకాశం ఉందా ..?? అనే ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ బాలకృష్ణ రెడ్డి మీడియా కు స‌మాధాన‌మిచ్చారు. మార్కెట్ లోకి వ‌స్తున్న కొత్త కొత్త యాప్స్ , వాటి ఫీచర్స్ వలనే నేరాలు పెరుగుతున్నాయని ఆయ‌న అన్నారు. కొత్త కొత్త యాప్స్ వలన ఫేక్ కాల్స్ పెరిగిపోతున్నాయని, ఫేక్ కాల్స్ వలన నేరాలు కూడా పెరుగుతున్నాయని, రాష్ట్రంలోనే ఉండి ఇతర దేశాలలో ఉన్నట్లు కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. గూగుల్ సంస్థ కు ఇలాంటి యాప్స్ నియంత్రించాలని లేఖ రాస్తున్నామ‌ని చెప్పారు.

ఇంటర్నేషనల్ కాల్స్ ను గుర్తించడం చాలా కష్టమ‌ని, ప్ర‌స్తుతం మన దగ్గర అంత టెక్నాలజీ లేదని చెప్పారు. నార్మల్ కాల్స్ అయితే ఐపీ అడ్రస్ ద్వారా, సెల్ ఫోన్ టవర్స్ ద్వారా గుర్తించవచ్చని.. ఇంటర్నేషనల్ కాల్స్ గుర్తించాలంటే చాలా టైం పడుతుందని అన్నారు. వీలైనంత వరకు ఫేక్ కాల్స్ ను అవైడ్ చేయడం మంచిదని చెప్పారు. ప్రజలందరూ ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest Updates