మార్కులే లైఫ్ కాదు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు: CP సందేశం

గచ్చిబౌలి, వెలుగు: ‘ర్యాంకులు, మార్కులే ప్రామాణికం కాదు.. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలి. అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలకు పాల్పడొద్దు’అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ శనివారం పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించలేదని మేడ్చల్ కు చెందిన నవ్యశ్రీ తాజాగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఫెయిలయ్యామని విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడొద్దన్నారు. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని, పరీక్షలే జీవితం కాదన్నారు.

చదువే జీవితం కాదు… చదువు లేకున్నా విషయజ్ఞానాన్ని , హార్డ్ వర్క్, ప్యాషన్ ను నమ్మి ఎంతో మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. చెప్పులు కుడుతూ వీధి దీపాల కింద చదివి అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారని గుర్తు చేశారు. ర్యాంకులు, మార్కులు బాగా తెచ్చుకోవాలని, తోటి విద్యార్థులతో పోటీ పడాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయొద్దని సూచించారు. బతకడానికి, విజ్ఞానం కోసమే కావాల్సిన చదువులు… యువతను మానసిక ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యల వైపు నడిపిస్తుండడం బాధాకరమన్నారు. ర్యాంకుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు.

విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచనలు

  • తమ పిల్లలు ఫెయిల్ ఆయ్యారనే బాధ తల్లిదండుల్లో ఉండడం సహజమే.. కానీ అదే సమయంలో పిల్లలతో దురుసుగా ప్రవర్తించొద్దు. ఈ సారి కాకపోతే మరోసారి పరీక్ష రాసేలా వారిలో ధైర్యాన్ని నింపాలి. వారిని సానుకూల దృక్పథంతో ఓదార్చాలి.
  • ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాల్లా చూస్తున్న పెద్దల ధోరణి మారాలి.
  • ఓడిపోయామని ప్రకటించడానికి విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకోకుండా చూడాలి.
  • పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారు జీవించి ఉండడం ప్రాధాన్యమైందని తెలుసుకోవాలి. తెలియజెప్పాలి.
  • ప్రెషర్ కుక్కర్ చదువులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తాయి. ర్యాంకుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదటికే చేటు చేస్తుంది.
  • ఫెయిలైనప్పటి కీ రీ-వాల్యుయేషన్ చేసుకునే వీలుంది. తొందరపడి ప్రతికూల నిర్ణయాలు తీసుకోవద్దు.
  • సప్లిమెంటరీ పరీక్ష రాసే అవకాశం ఉందని తెలిపి మానసికంగా కృంగి పోకుండా చూడాలి.
  • పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన అన్నిదారులు మూసుకుపోయాయని అనుకోవద్దు. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసి జీవితంలో పైకి వచ్చిన వారు ఎన్నో రంగాల్లో ఉన్నారు. పిల్లల ఆసక్తిని బట్టి ప్రోత్సహించాలి.
  • పిల్లలు డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోతే సైకాలజిస్ట్ ను సంప్రదించాలి.
  • విద్యాపరమైన లక్ష్యాలను సాధించలేకపోవడం అంటే మనిషి జీవించే అర్హతను కోల్పోవడం కాదని చెప్పాలి.

Latest Updates