కెరటాలు కాటేసినయ్ : ​ఆ కన్నీళ్లకు 42 ఏళ్లు

ప్రకృతికి పట్టరాని కోపమొస్తే కళ్లు మూసి తెరిచే లోపు ప్రపంచం వల్లకాడు అవుతుందనటానికి దివిసీమ ఉప్పెన తిరుగులేని హెచ్చరిక. ఈ విషాదం ఆంధ్రప్రదేశ్​ చరిత్రలో చెరిపేయలేని అధ్యాయం. ఆ రాష్ట్ర ప్రజలు రాత్రి అవుతోందంటే చాలు ప్రాణభయంతో వణికిపోయే పీడకల. తీర ప్రాంత ప్రజలకు తీరని శోకం. కనికరం లేని రాకాసి అలలు కొన్ని వేల జీవితాలకు కాళరాత్రిని మిగిల్చిన ఘోరం. ఆ కన్నీళ్లకు ఇవాళ్టికి 42 ఏళ్లు.

నవంబర్​ 19, 1977 శనివారం.. వాతావరణం దెబ్బకి మనిషి ఘోరంగా ఓడిపోయిన రోజు. ప్రకృతి వికృత రూపం దాల్చి వేల ప్రాణాల్ని తీసుకెళ్లిన రోజు. ఆ రాత్రి ఆంధ్రప్రదేశ్​లోని దివిసీమకు కాళరాత్రిగా మిగిలిపోయింది. సముద్రపు అలలు ఉన్నట్టుండి తాటిచెట్టంత ఎత్తున ఎగిసి విరుచుకుపడ్డాయి. ఊళ్లకు ఊళ్లను శవాల గుట్టలుగా మార్చాయి. అయినవాళ్లను కోల్పోయినోళ్ల కళ్ల తడి ఆరక ఇవాళ్టికి 42 ఏళ్లు. తీరప్రాంత గ్రామాల జనాలను ఈ చేదు జ్ఞాపకాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

దివిసీమ.. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక చిన్న సారవంతమైన ద్వీపం. అవనిగడ్డ వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది. ఆ సీమలో పదుల సంఖ్యలో ఉన్న పల్లెల్లోని ప్రజలకు ఆ శనివారం తెల్లారింది మొదలు తుఫాన్​ హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. దీంతో జనాలు ఇళ్లలోనే ఉండిపోయారు. తుఫాన్లు తమకు మామూలే కాబట్టి ఎప్పటిలాగే తీరం దాటతాయని అనుకున్నారు. నిశ్చింతగా గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోయారు.

శాశ్వత నిద్రలోకి..

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందంట. ప్రజలు అనుకున్నది జరగలేదు. ప్రళయం ఒక్కసారిగా ముంచెత్తింది. రాకాసి అలలు నాల్కలు చాచాయి. దాదాపు 30 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో జనం పరుగులు తీసేందుకు కూడా అవకాశం లేకుండాపోయింది. కాళ్ల కింద నేల కంపించినట్లు అయింది. ఎవరెటుపోయారో ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. రెండు గంటల తర్వాత చూస్తే అంతా తుడిచి పెట్టుకుపోవటం కనిపించింది.

ఊళ్లు లేవు. ఊళ్లల్లో పిట్టపురుగు లేదు. అన్నీ వల్లకాడయ్యాయి. జనాలు శవాలుగా మారి నీళ్లపై తేలుతున్నారు.   నిద్రలో ఉన్నోళ్లను తుఫాన్​ శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. పశువులు, పక్షులు అల్లకల్లోలమయ్యాయి. పల్లెలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆ విలయం మిగిల్చిన విషాదం నేటికీ ఆ తరం వాళ్ల కళ్లముందే కదలాడుతోంది. దివిసీమ ఉప్పెన సుమారు 83 గ్రామాలను జల సమాధి చేసింది. ఎటు చూసినా కూలిన ఇళ్లు, చెట్లతో భయంకరమైన పరిస్థితే కనిపించింది.

పది వేల ప్రాణాలు..

ఉప్పెన ధాటికి పది వేల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మరికొన్ని వేల మంది ఆచూకీ లేకుండా వరద నీటిలో కొట్టుకు పోయారు. 33 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా జాలర్లు ఎక్కువగా ఉండే రెండు మండలాల్లోని గ్రామాలు నేలమట్టమయ్యాయి. అవి.. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసల దీవి, ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం, ఊటగుండం. నాగాయలంక మండలంలోని ఏటిమొగ, సోర్లగొంది, ఎదురు మొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ.

చెట్టుకొకరు.. పుట్టకొకరు

నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలోనే 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెంలో 161 మంది చనిపోయినట్లు ప్రభుత్వ అంచనా. లక్షల మంది గూడు కరువైంది. చిమ్మ చీకట్లో ఉప్పెన విరుచుకుపడటంతో అనేక మంది కొట్టుకుపోతూ తుమ్మ కంపల్లో, ముళ్ల కంచెల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సోర్లగొందిలోని రామాలయంలో, పంచాయతీ కార్యాలయాల్లో తలదాచుకుని 200 మంది ప్రాణాలతో బయట పడ్డారు.

400 మందిని కాపాడిన ‘వేణుగోపాలుడు’

ఉప్పెన ప్రభావం కృష్ణా జిల్లాతోపాటు గుంటూరు జిల్లాలోనూ కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు దెబ్బతిన్నాయి. హంసలదీవిలో శ్రీరుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఈ విపత్తు నుంచి 400 మందిని రక్షించింది. ఆ రోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోవటం మొదలైంది. దీంతో ప్రజలు ఆ గుడిలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్లకుఊళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయినా ఈ ఆలయంలోకి చుక్క నీరు కూడా రాలేదు. దివిసీమ ఉప్పెన ఆంధ్రప్రదేశ్​ అంతటినీ వారం రోజుల పాటు కుదిపేసింది. నవంబర్ 14  నుంచి 22 వరకు ఎడతెరిపి లేకుండా వీచిన చలిగాలులు, కుండపోతలా కురిసిన వర్షం జనజీవనాన్ని ఆపేసింది.

సునామీ వేరు..

సునామీ అంటే జల ప్రళయమే. సముద్రం గర్భంలో  భూకంపం వచ్చినప్పుడు సునామీ ఏర్పడుతుంది. సునామీ వచ్చినప్పుడు సముద్రంలో కెరటాలు కొన్ని మీటర్ల ఎత్తున ఎగిసిపడతాయి. కెరటాల పోటు అనేక రెట్లు పెరుగుతుంది. కెరటాల ప్రయాణం కూడా హై స్పీడులో ఉంటుంది. దాదాపుగా గంటకు 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు స్పీడు ఉంటుంది. ఈ స్పీడుతో కెరటాలు సముద్రం ఒడ్డును తాకితే ….అంతా ప్రళయమే. అంతా విధ్వంసమవుతుంది. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబర్ లో ఏర్పడిన సునామీ మొత్తం 14 దేశాల్లో దాదాపు రెండున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. శ్రీలంక, థాయ్ లాండ్ ఎక్కువగా నష్టపోయాయి. ఈ సునామీ మనదేశాన్ని కూడా తాకింది. తమిళనాడులో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. పెద్ద సంఖ్యలో  ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన జల ప్రళయంగా ఇండోనేషియా సునామీ చరిత్రలో నిలిచిపోయింది.

అన్ని తుఫాన్లు ఉప్పెనలు  కావు

తుఫాను వచ్చినప్పుడల్లా ఉప్పెన (టైడల్​ వేవ్​)రాదు. మామూలు తుఫాన్లప్పుడు ఫరవాలేదు కానీ తీవ్రత పెరిగితే ఒక్కోసారి ఉప్పెన తప్పదు. తుఫానులో నష్టం కొంతవరకే ఉంటుంది. ఉప్పెనలో నష్టం తీవ్రంగా ఉంటుంది. సముద్రానికి వరద లాంటిది ఉప్పెన. సముద్రానికి సహజంగా ఆటుపోట్లుంటాయి. పోటు సమయంలో తుఫాను వస్తే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పెన వల్ల కెరటాలు ఉవ్వెత్తున లేస్తాయి. సముద్రం అల్లకల్లోలమై తీర ప్రాంతంపైకి దండెత్తుతుంది. కిలోమీటర్ల దాకా ముంచేస్తుంది.

దేశం మొత్తాన్నే కదిలించింది

పది వేల మందికి పైగా ప్రజలు, రెండున్నర లక్షలకు పైగా పశువులు, నాలుగు లక్షల కోళ్లను పొట్టనపెట్టుకొని, ఎనిమిదిన్నర వేలకుపైగా ఇళ్లను నేలకూల్చిన దివిసీమ ఉప్పెన యావద్దేశాన్ని కదిలించింది. మొత్తం ఆస్తి నష్టం 42 ఏళ్ల కిందటే దాదాపు రూ.172 కోట్లుగా నమోదైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలు ముందుకొచ్చి బాధితుల్ని అక్కున చేర్చుకోవటం చెప్పుకోవలసిన విషయం. మృతులకు గుర్తుగా అవనిగడ్డ మండలంలోని పులిగడ్డలో స్థూపం నిర్మించారు.  సోర్లగొంది గ్రామాన్ని పోలీస్​ శాఖ దత్తత తీసుకుని ఇళ్లు కట్టించింది. మూలపాలానికి ఆరెస్సెస్​ అండగా నిలిచింది. ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్, బీజేపీ లీడర్​ బండారు దత్తాత్రేయ ఈ ఊరుకి వచ్చి బీభత్సాన్ని కళ్లారా చూశారు. నాటి మూలపాలెం నేడు దీన్​దయాళపురంగా మారింది. సోర్లగొందిలో ఉప్పెనకు గుర్తుగా గ్రామ ప్రజలు ఏటా నవంబర్ 19న సంతాపం తెలుపుతారు. ఆ ఊరులోని జాలయ్య పాడే పాటలో ఉప్పెన విధ్వంసం మొత్తం  కళ్లకు కడుతుంది.

అక్టోబరు వస్తే తుఫాన్ల భయం

అక్టోబరు నెల రాగానే అందరికీ తుఫాన్ల భయం పట్టుకుంటుంది. ఎక్కువగా అక్టోబరు, నవంబరు నెలల్లోనే తుఫాన్లు వస్తుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుఫాన్లన్నీ ఎక్కువగా అక్టోబరు, నవంబరు నెలల్లోనే వచ్చాయి. విశాఖ నగరంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన హుద్ హుద్ తుఫాను 2014 అక్టోబరులోనే వచ్చింది. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన హుద్ హుద్ తుఫాన్ బెంగాల్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ తీరాలను కూడా తాకింది. కిందటేడాది అక్టోబరులో తిత్లీ వచ్చింది. తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు బాగా నష్టపోయాయి. భారీ వర్షాలకు, ఈదురు గాలులకు ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయింది.

Latest Updates