గుజరాత్ కు ‘వాయు’గండం: దూసుకొస్తున్న తుఫాను

cyclone-vayu-hit-gujarat-thursday-afternoon

‘వాయు’ తుఫాను వేగంగా కదులుతోంది. అతి తీవ్రంగా మారి గుజరాత్‌‌ వైపు దూసుకొస్తోంది. గురువారం దక్షిణాన వెరవల్‌‌–పశ్చిమాన ద్వారకల మధ్య ‘వాయు’ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ద్వారక, వెర్వల్‌‌ ప్రాంతాలకు దక్షిణాన 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం మధ్యాహ్నానికి 180 కిలోమీటర్లకు వేగం పెరగొచ్చని చెప్పింది.

10 జిల్లాల్లో రెడ్ అలర్ట్
గుజరాత్‌‌లలోని 10 తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ పది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌‌ రూపానీ చెప్పారు. వీరికి ప్రభుత్వ భవనాలు, ట్రస్టులు, ఎన్జీవోల బిల్డింగుల్లో షెల్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలను తరలించేందుకు సౌరాష్ట్రలోని ఒఖా నుంచి రాజ్‌‌కోట్‌‌, అహ్మదాబాద్‌‌లకు రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 10 జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.ఈ ప్రాంతాల్లోని పోర్టులు, విమానాశ్రయాల్లో పనులను తాత్కాలికంగా నిలిపేశారు. కచ్‌‌, సౌరాష్ట్రల్లోని అన్ని ఎయిర్‌‌పోర్టులను మూసేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అహ్మదాబాద్‌‌ నుంచి తీర ప్రాంతాలవైపు వచ్చే విమానాలను రద్దు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రెండ్రోజులు ఆ ప్రాంతాల్లోని అన్ని రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే తెలిపింది.

40 ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ బృందాలు.. 9 హెలికాప్టర్లు
ఇప్పటికే 10 ఆర్మీ టీమ్​లు, 40 ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ బృందాలు తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. మరో 11 బృందాలు సాయానికి సిద్ధంగా ఉన్నాయి. నేవీకి చెందిన వార్​షిప్పులు, ఎయిర్​క్రాఫ్టులు రెడీగా ఉన్నాయి. తొమ్మిది హెలికాప్టర్లను రెడీగా ఉంచామని గుజరాత్‌‌ రెవెన్యూ శాఖ అడిషనల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ పంకజ్‌‌కుమార్‌‌ చెప్పారు.

Latest Updates