నిజాం వ్యతిరేక పోరాట వీరుడు… దాశరథి వర్ధంతి నేడు

సినీగీత రచయితకు ఉండవలసిన ముఖ్య లక్షణం వేగంగా పాటలను రాయడం. సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయడం సామాన్యమైన విషయం కాదు.  దాశరథి కృష్ణమాచార్య ప్రేమగీతం రాసినా, విరహగీతం, విప్లవగీతం రాసినా, ఆ శైలిలోనే రాసేవారు. దాశరథి అనేక ప్రక్రియల్లో కవిగా ప్రతిభను చాటుకున్నారు. పాట రాయడానికే పుట్టిన వ్యక్తిలా కనిపించేవారు.  మహాకవి దాశరథి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

పాట రాసిన తర్వాత ఏ ఒక్కరు విమర్శకు దిగినా…  ఆ పాట పనికిరాకుండా పోతుంది. ఇలాంటివి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న వేటూరి ‘సినీ గీత రచయితకు ఐదుగురు భర్తలున్నారు’ అని చెప్పారు. అలాంటి కష్టమైన ప్రక్రియ సినీ గీత రచన. దీనికి ఉండవలసిన  నాలుగు ముఖ్య లక్షణాలను  గీత రచయిత చంద్రబోస్ చెప్పారు.  (1) అనుభవ జ్ఞానం, (2) ఆలోచన జ్ఞానం, (3) అధ్యయన జ్ఞానం, (4) ఆకస్మిక జ్ఞానం.  ఈ  నాలుగు రకాల జ్ఞాన సంపత్తి దాశరథి పాటల్లో కనిపిస్తుంది. ఆయన గీతాల్లో శబ్ద లాలిత్యం ప్రధానం. ఆయన గీతాల్లో అలతి అలతి పదాలు మాత్రమే కనిపిస్తాయి. దాశరథి ప్రేమగీతం రాసినా, విరహగీతం, విప్లవగీతం రాసినా, ఆ శైలిలోనే రాసేవారు.

దాశరథి కృష్ణమాచార్య సంప్రదాయంలో  పుట్టి తెలంగాణా విముక్తికోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. దాశరథి చదువు పూర్తిగా ఉర్దూలోనే సాగింది. దాశరథి చిన్నతనంలోనే గాలిబ్ కవిత్వానికి ఆకర్షితుడయ్యారు. తర్వాత కవి ఇక్బాల్ కవిత్వం అతని దృక్పథాన్ని మార్చి విప్లవ కవిత్వంవైపు మళ్లించింది. 1944లో మగ్దూమ్ కవితలను అనువదించారు. స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టి తన కవిత్వంతో గర్జించాడు.

‘ఓ నిజాము పిశాచమా, కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ నిరసన గానం చేసి, 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. దాశరథి రాసిన దాదాపు 30 పుస్తకాలలో అగ్నిధార, మహాంద్రోదయం, గాలిబ్ గీతాలు, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, యాత్రాస్మృతి మొదలైనవి ప్రాచుర్యం పొందాయి. ఆయన కలం సాగితే పాట పూర్తయ్యేవరకు ఆగేది కాదు. ముఖ్యంగా  ప్రేమికుల వలపు పాటల్ని ఎక్కువగా రచించారు.

దాశరథి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ముందే అనేక ప్రక్రియల్లో కవిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన పాట రాయడానికే పుట్టిన వ్యక్తిలా కనిపించేవారు. ఆచార్య ఆత్రేయ తన దర్శకత్వంలో వచ్చిన ‘వాగ్దానం’ చిత్రంలో మొట్టమొదటి పాటను దాశరథితోనే రాయించారు. ‘నా కంటిపాపలో నిలిచిపోరా/ నీ వెంట లోకాలు గెలువనీరా’ అనే పాటలో దాశరథి చిన్న చిన్న పదాలతో చేసిన భావ ప్రకటన వింటే తనువు, మనసు పులకించకుండా ఉండవు. దాశరథి రాసింది మొదట ఈ పాటే అయినా, ఆయన పాటలు రచించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమా ముందుగా విడుదల అయింది. అందుకే  ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ అనే పాటను దాశరథి మొదటి పాటగా సినీ విమర్శకులు చెబుతుంటారు.

మంచి మనసులు (1962) సినిమాలో కొంటె ప్రేమికులు పాడుకునే ‘నన్ను వదలి నీవు పోలేవులే, అదీ నిజములే/ పూవు లేక తావి విలువ లేదులే లేదులే’ అనే గీతంలో దాశరథి అనేక ప్రయోగాలు చేశారు. ‘నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో’ అంటూ చూపును వలగా చేయడం సామాన్యమైనది కాదు. పునర్జన్మ (1963)లోని ‘దీపాలు వెలిగె’ పాటలోని రెండో చరణం కేవలం నాలుగు చిన్న వరసలతో కూడి ఉంటుంది. కానీ ప్రేమికురాలు తనలోని విరహాన్ని ఎంతగా తెలిపిందో చూడండి. ‘నా తోడు నీవు నీ నీడ నేను/ మన ఇరువురిదే ఈ రేయి/ ఇక జాగు చేయ తగదోయి నీకు/ నా చల్లని రాజా రావోయి’ అంటూ సాగే ఈ పాటను సుశీల ఎంతో శ్రావ్యంగా ఆలపించారు.

పాటల రచయితగా దాశరథి చేసిన ప్రయోగాలు తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచిపోతాయి. మూగ మనసులు సినిమాలో దాశరథి రాసిన గీతం ‘గోదారి గట్టుంది’ పాట చాలా సాధారణంగా ప్రారంభమౌతుంది. ఆ పాట మూడో చరణంలో పాత్రలోని మెచ్యూరిటీని తెలియజేశారు. గొప్ప తాత్వికత చూపించారు.  ‘పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుందీ / అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంతుందీ…’ అన్నారు. అంటే ఆమె ఈ అనంత విశ్వంలో ఒక గుర్తింపు లేని చిన్న అణువే కావొచ్చు. కానీ పిసరంత ఆ అణువులోనే ఈ ప్రపంచం ఒదిగిపోయే వైశాల్యం ఉందని, అందుకే ఈ జగతి తన మనసులో దాగుందని చెప్పారు.

గూడుపుఠాణి చిత్రంలో ‘తనివి తీరలేదే నా మనసు నిండలేదే’ అనే పాట ఇప్పటికీ యువకుల హృదయాలను రంజింపచేస్తూనే ఉంది.  పండంటి కాపురం చిత్రంలో ‘బాబు వినరా అన్నాతమ్ముల కథ ఒకటి’ పాట ఎప్పటికీ మరువలేం. మొత్తం సినిమా కథంతా తెలుపుతూ కుటుంబంలోని వివిధ పాత్రల అనుబంధాలను తేటతెల్లం చేస్తుంది. ఇది తెలుగు సినిమా పాటల్లో ఆణిముత్యమే.

దాశరథి పాటల్ని ఎన్నని ఉదాహరించాలి. కన్నె వయసు చిత్రంలోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాట రెండో చరణంలో ‘నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే, పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే’ అంటూ అంతరంగంలో కావ్యకన్యను ఆహ్వానించే తీరు దాశరథిలోని కవితాత్మకతను తెలియజేస్తుంది. దాశరథి జీవితమే కవిత్వం – కవిత్వమే ఆయన జీవితం.

– మౌనశ్రీ మల్లిక్ …….సినీ గీత రచయిత, 8919338546

Latest Updates