అంపైర్ సచిన్ ను నాటౌట్ గా ప్రకటించాడు

డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ పై స్టెయిన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ అంపైర్లలో ఒకడైన ఇయాన్ గోల్డ్ పై సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని కూడా కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ లాంటి వాళ్లు డబుల్ సెంచరీలు కొట్టినప్పటికీ సచిన్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ మర్చిపోరనే చెప్పాలి. సఫారీ టీమ్ పై సచిన్ ఆడిన ఈ డబుల్ సెంచరీని క్రిటిక్స్ కూడా అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుంటారు. అయితే తాజాగా ఈ ఇన్నింగ్స్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ను సఫారీ పేసుగుర్రం స్టెయిన్ బయటపెట్టాడు.

‘వన్డేల్లో సచిన్ డబుల్ సెంచరీ కొట్టాడు. అదీ మాపైనే గ్వాలియర్ లో బాదాడు. నాకు ఇంకా గుర్తుంది.. ఆ ఇన్నింగ్స్ లో నేను సచిన్ ను ఎల్బీడబ్ల్యూ చేశా. అప్పటికి అతడు 190 రన్స్ లోపు ఉన్నాడు. ఆ మ్యాచ్ లో ఇయాన్ గోల్డ్ అంపైర్ గా ఉన్నాడు. అతడు సచిన్ ను నాటౌట్ గా ప్రకటించాడు. అప్పడు నేను ఎందుకు, ఎందుకు మీరు నాటౌట్ గా ప్రకటించారు? అని ప్రశ్నించా. దానికి సమాధానంగా.. ‘ఒకవేళ నేను అతణ్ని ఔట్ గా ప్రకటిస్తే నేను తిరిగి హోటల్ కు వెళ్లలేను’ అంటూ గోల్డ్ చెప్పాడు. అయినప్పటికీ సచిన్ అంటే నాకు ఎంతో అభిమానమం. క్రికెట్ బుక్ లోని ప్రతి షాట్ ను అతడు ఆడాడు. సచిన్ ఎప్పుడోసారి గానీ ఎల్బీడబ్ల్యూ అవ్వడు. ఇండియాలో ఆడేటప్పుడు సచిన్ కు బ్యాడ్ బాల్ వేయాలని మాత్రం వేయొద్దు. బ్యాడ్ బాల్ వేస్తే అతడు కచ్చితంగా బౌండరీకి తరలిస్తాడు’ అని స్టెయిన్ ఆ ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకున్నాడు.

Latest Updates