దళితుల బతుకులు ఆగమైపోతున్నాయ్: మందకృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఎమ్మార్పీఎస్‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

రాజన్న సిరిసిల్ల, వెలుగు: దొరల రాజ్యంలో దళితుల బతుకులు ఆగమైతున్నాయని, అభివృద్ధి పనుల పేరిట దళితుల భూములు లాక్కుంటున్నారని ఎమ్మార్పీఎస్‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో మందకృష్ణ పర్యటించారు. ‘మా భూములు మాకు కావాలి’ అని ఎమ్మార్పీఎస్‌‌ కార్యకర్తలు చేపట్టిన దీక్షా శిబిరంలో మాట్లాడారు. జిల్లాలో భూమి కోల్పోయిన దర్శనం రాజకిషన్‌‌తోపాటు మరికొందరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడుతాయనుకుంటే చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. శ్మశానవాటికలు, ప్రకృతివనాలు, రైతువేదికలంటూ భూములు లాక్కుంటే తట్టుకోలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని  ప్రశ్నించినవారిపై కేసులు, పీడీ యాక్ట్‌‌లు నమోదు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సైతం దళిత, బహుజనులే త్యాగం చేశారని చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌‌ ఇప్పుడు పైసల్లేవంటున్నారని, పైసలు లేనిదే సెక్రటేరియట్‌‌ కడుతున్నవా అని ప్రశ్నించారు. 2023లో టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఓటమి ఖాయమని, మహాజన సోషలిస్ట్‌‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తామే అధికారంలోకి వచ్చి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, భూమి లేకుంటే వారి అకౌంట్లలో ఎకరాకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు జమ చేస్తామని తెలిపారు. దళితుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దళితుల సమస్యలపై ఏ ప్రతి పక్ష పార్టీ మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. దళిత సంఘాల నేతలు మార్వాడి సుదర్శన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates