తెలంగాణలో దళితులు,గిరిజనుల పై హింసాకాండ జరుగుతోంది: ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. దళిత రైతు నర్సింహులుకు చెందిన 13 గుంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదిక కోసం తీసుకోవడం కారణంగానే  ఆయన  చనిపోయాడన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రైతు మరణించించిన తర్వాత  ఒక ఎకరా భూమి ఇస్తున్నాని మంత్రి హరీశ్ రావు ప్రకటించడం దురదృష్టకరమన్నారు. నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, SC,ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

13శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్ లో స్థానం ఉండదని…ఒకటి, రెండు జనాభా శాతం ఉన్న వారికి రెండు మూడు మంత్రి పదవులు ఉంటాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ సీఎం అయ్యారు అంటే దానికి ముఖ్యంగా దళితులు,గిరిజనులే కారణమనేది మర్చిపోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు,గిరిజనుల పై ప్రతిరోజు హింసాకాండ జరుగుతోందన్నారు. తెలంగాణ లో పోలీసులు నిజాయితీగా ఉన్నా..కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితులపై దాడులు జరుగుతున్నఘటనల్లో న్యాయం జరగడం లేదన్నారు. దళితుల పై జరుగుతున్న దాడుల ఘటనల పై గవర్నర్ తో పాటు జాతీయ మానవ హక్కులను కలుస్తామన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. కొప్పుల ఈశ్వర్ దళిత నాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారన్న ఉత్తమ్..తప్పుడు ప్రకటనలు చేసి మంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని తెలిపారు.

Latest Updates