దళితుడ్ని సీఎం చేయడం కాంగ్రెస్ పొలిటికల్ స్టంట్

దళితుడ్ని సీఎం చేయడం కాంగ్రెస్ పొలిటికల్ స్టంట్

లక్నో: గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన పంజాబ్ రాజకీయాల్లో ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ సీఎం అమరిందర్ సింగ్ రాజీనామాతో నెలకొన్న సందిగ్ధతకు కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ నియామకంతో తొలగినట్లయింది. రాష్ట్ర తొలి దళిత సీఎంగా చరణ్‌జిత్ చన్నీ రికార్డు సృష్టించారు. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. కాంగ్రెస్ రాజకీయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాయావతి హెచ్చరించారు. 

‘కాంగ్రెస్‌‌కు దళితుల మీద నమ్మకం లేదు. ఆ పార్టీ ద్వంద్వ వైఖరి మీద దళితులు అప్రమత్తంగా ఉండాలి. దళితులు కాంగ్రెస్ ఉచ్చులో పడరని నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని మాయావతి చెప్పారు. పంజాబ్ సీఎంగా చన్నీని నియమించినప్పటికీ.. ఆ రాష్ట్ర ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో జరగవని మాయావతి అభిప్రాయం వ్యక్తం చేశారు. దళితేతర నేత అధ్యక్షతనే పంజాబ్ ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడే అందరికీ దళితులు గుర్తుకొస్తారని.. చన్నీ నియామకం పూర్తిగా కాంగ్రెస్ చేస్తున్న పొలిటికల్ స్టంట్ అని ఆరోపించారు.