లక్షకు పైగా ఎకరాల్లో సోయా పోయింది!

  •     భారీ వర్షాలకు ఐదు జిల్లాల్లో దెబ్బతిన్న పంట
  •     పూత, కాత రాలి నష్టపోయిన రైతులు
  •     కష్టమంతా నీళ్లపాలై కన్నీరుమున్నీరు
  •     సర్కారు ఆదుకోవాలని వేడుకోలు

ఆదిలాబాద్, కామారెడ్డి, బోధన్, వెలుగువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఐదు జిల్లాల్లో సోయాపంటకు భారీ నష్టం వాటిల్లింది. రోజుల తరబడి నీళ్లు  నిల్వ ఉండడంతో జాలు కారణంగా మొక్కలు ఎక్కడికక్కడ కుళ్లిపోతున్నాయి.  కాత, పూత రాలి చేన్ల రూపురేఖలే మారిపోతున్నాయి. ఆయా జిల్లాల్లోలక్షా 18వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  కోతదశకు వచ్చిన వేలాది ఎకరాల్లో కాయలు చెట్లపైనే మొలకెత్తడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ. 25వేల వరకు పెట్టుబడి పెట్టామని, సర్కారు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

4.50 లక్షల ఎకరాల్లో సాగు..

తెలంగాణ వ్యాప్తంగా  ఈ ఖరీఫ్​లో 4.50 లక్షలకుపైగా ఎకరాల్లో సోయా సాగు చేయాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లు నిర్ణయించారు. ప్రధానంగా ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో ఈ పంట వేశారు. ఈసారి సీడ్​దగ్గరి నుంచే సోయా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 1.48 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరముంటుందని ఆఫీసర్లు ప్రభుత్వానికి ఇండెంట్​ పెడితే సగం కూడా సప్లై చేయలేదు. వాటిలోనూ జర్మినేషన్​ సమస్య రావడంతో పరిహారం కోసం రైతులు రోడ్డెక్కారు. మళ్లీ దుక్కి దున్ని మహారాష్ట్ర నుంచి తెచ్చిన సీడ్​ వేశారు. తీరా పంట చేతికి వస్తుందనే తరుణంలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

సగానికి పైగా ఖతం..

ఆదిలాబాద్ జిల్లాలో 93,200 ఎకరాల్లో సోయా సాగుచేయగా, దాదాపు 40 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్​, నార్నూర్​, జైనూర్​, కెరమెరి మండలాల్లో నష్టతీవ్రత ఎక్కువగా ఉంది. నిర్మల్​ జిల్లాలో 96 వేల ఎకరాల్లో సాగు చేయగా, తాజా వర్షాలకు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆసిఫాబాద్​ జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో సాగుచేయగా, ఆసిఫాబాద్​, వాంకిడి, తిర్యాణి, కాగజ్​నగర్​, కౌటాల మండలాల్లోని సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. అయితే  జిల్లాలో 3 వేల ఎకరాల్లోనే సోయా సాగవుతుందని అధికారులు చెప్పడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో 82,042 ఎకరాల్లో సోయా పంట వేయగా, 12,333 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ప్రధానంగా మద్నూర్ మండలంలో  4,968 ఎకరాలు, జుక్కల్ మండలంలో  2,700 ఎకరాలు,  బిచ్కుంద మండలంలో  4,665  ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో  74,759 ఎకరాలకుగాను 16 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా బోధన్​ డివిజన్​లోని బోధన్​, కోటగిరి, రెంజల్, వర్ని, చందూర్​, రుద్రూర్​, మోస్తా​ మండలాల్లో అత్యధికంగా 27వేల221 ఎకరాల్లో సోయా సాగుచేయగా, పెట్టుబడులకు మునగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొక్కల మీదే మొలకలు..

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలోని కల్దుర్కికి చెందిన ఈ రైతు పేరు బోర్రోల శంకర్​. ఖరీఫ్​లో వ్యవసాయాధికారుల సూచన మేరకు మూడెకరాల్లో సోయాబిన్​ వేశాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేను మొత్తం దెబ్బతిన్నది.  మొక్కల మీదే కాయలు మొలకెత్తాయి. ఎకరాకు రూ.25వేల చొప్పున రూ.75వేల దాకా నష్టపోయానని శంకర్​కంటతడిపెట్టాడు. తీవ్రంగా నష్టపోయిన తనలాంటి సోయా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

కష్టమంతా నీళ్లపాలు

ఐదెకరాల్లో సోయా, మూడెకరాల్లో కంది, పెసర పంట వేసిన. ఏపుగా పెరిగినయ్​. కొద్ది రోజులయితే కోతకు వస్తుండే. పెద్ద వానలు వచ్చి చేన్ల నిండా నీళ్లు నిలిచాయి. మోకాలు లోతు వరకు నీళ్లు వచ్చాయి. మా కష్టమంతా నీళ్లపాలైంది.  సోయా, పెసరి పంటకు మొలకలొస్తున్నాయి. మూడెకరాల్లో సోయా మొత్తం పోయింది.

‑ బాలాజీ కౌసంది, రైతు, చిన్న ఎడ్గి, జుక్కల్​

సర్కారు ఆదుకోవాలె..

మూడెకరాల్లో సోయా వేసిన. రూ.30వేల వరకు ఖర్చయ్యింది. కొద్ది రోజులయితే పంట చేతికొస్తుండే.  పెద్ద వానలకు మొత్తం పంట పోయింది.  చాలా మంది రైతుల సోయా కొట్టుకుపోయింది. గిట్లయితదనుకొలే. పెట్టుబడి మొత్తం పోయినట్లే.

‑ రవీందర్, రైతు, జుక్కల్

మొలకలు వచ్చాయి..

సోయాపంటతో యేటా నష్టాలు వస్తు న్నాయి. ఈసారి రెండె కరాల్లో సోయా వేశాను. వారం రోజులు కురిసిన వర్షానికి పచ్చికాయలు కూడా మొలకెత్తాయి.  కోతదశకు వచ్చిన పంటంతా దెబ్బతింది. ఆఫీసర్లు ఆదుకోవాలి.

‑ కర్రోల యాదు, రైతు, కల్దుర్కి

Latest Updates