డ్యామ్‌‌‌‌‌‌‌‌లతో మలేరియా ముప్పు

డ్యాంలు, రిజర్వాయర్లు కడితే.. సాగునీరు, తాగునీరు దొరుకుతుంది. కరెంట్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలుంటాయన్నది మనకు తెలిసిందే. అయితే, రిజర్వాయర్ల వల్ల మలేరియా ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుందట. డ్యాంల చుట్టు పక్కల ఉండేవారికి మలేరియా వ్యాపించే అవకాశాలు అధికంగా ఉంటాయట. ఆఫ్రికాలో నిర్వహించిన ఓ రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా రీసెర్చర్ సాల్మన్ కిబ్రెట్ వెల్లడించారు.

‘ఆఫ్రికాలో కరువు ఎక్కువగా ఉంటుంది. చాలాచోట్ల తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకవు. అందుకే అక్కడ డ్యాంలు, రిజర్వాయర్ల నిర్మాణం క్రమంగా పెరుగుతోంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే మలేరియా కేసుల్లో దాదాపు 90% కేసులు సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలోనే రికార్డ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మలేరియాపై మేం రీసెర్చ్ చేయగా ఈ విషయం తేలింది’ అని ఆయన తెలిపారు.

సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో 2000 నుంచి 2015 మధ్య 1.9 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇక్కడ పెద్ద డ్యాంల సంఖ్య 884 నుంచి 919కి పెరిగాయి. దీంతో ఈ రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో రీసెర్చర్లు దృష్టి సారించారు. డ్యాంలు, రిజర్వాయర్లకు 5 కి.మీ. దూరంలోని ప్రాంతాల్లోనే మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గుర్తించారు.

డ్యాంల నిర్మాణం, వాటి పరిసరాలను కూడా శాటిలైట్ డేటాతో సహా పరిశీలించారు. ఫలితాలను విశ్లేషించగా.. డ్యాంలు ఉన్న ప్రాంతం ఎత్తు, అక్కడి వర్షపాతం, టెంపరేచర్ వంటివి మలేరియా పెరుగుదలకు కారణమవుతున్నాయని తేలింది. అన్నింటికంటే ముఖ్యంగా డ్యాంలు, రిజర్వాయర్ల తీరాలు ఎంత ఎక్కువ వాలుగా ఉంటే మలేరియా ముప్పు అంత తక్కువగా ఉంటుందని గుర్తించారు. డ్యాంల చుట్టూ చిన్న చిన్న గుంతల్లో నీరు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దానికి అనుకూల టెంపరేచర్లు కూడా తోడవుతుండటంతో దోమలు విపరీతంగా పెరిగేందుకు చాన్స్ ఉండటం వల్లే ఇక్కడ మలేరియా ముప్పు ఎక్కువగా ఉంటోందని రీసెర్చర్లు చెప్పారు.

మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త డ్యాంలు కట్టేటప్పుడు పై విషయాలన్నీ పరిశీలించి, స్థలం ఎంపిక చేసుకుంటే మంచిదని వారు సూచించారు.