స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ తో డేంజర్ 

…బ్లూ వేల్ తరహాలో యువతలో మరో కొత్త వ్యసనం

…తలలు పగలుకొట్టుకుంటున్న టీనేజర్లు

…ఇలాంటి స్టంట్ లు ప్రమాదకరమంటున్న డాక్టర్లు

…‘బీ కేర్ ఫుల్’ అంటున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులకు కావడం ఆందోళన కలిగిస్తోందని.. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇటీవల కాలంలో ‘ఛాలెంజ్’లు ఎక్కువైపోయాయి. అందులో చాలా  చెడు చేసేవే ఎక్కువ  ఉన్నాయి. లేటెస్టుగా  ఎముకలు విరగ్గొట్టుకునే చాలెంజ్ నెట్ లో వైరల్ అవుతోంది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజింగ్ స్టంట్ వైరల్ అవుతోంది. యువత ఈ ఛాలెంజ్ భారిన పడే అవకాశముందని తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

ఇప్పటికే అలాంటి ప్రమాదకరమైన గేమ్స్ ఎన్నో వచ్చాయి. వీటి భారిన పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.రన్నింగ్ కార్ నుంచి దిగి.. స్లోగా కదులుతున్న ఆ కార్ పక్కన డ్యాన్స్ చేసి మళ్లీ కారెక్కే ‘రన్నింగ్ మ్యాన్’ ఛాలెంజ్. ఆ గేమ్ తో చాలా మంది యాక్సిడెంట్ల బారిన పడ్డరు. ఒకరి నోట్లోని సిరీల్స్ ను తీసుకుని తినే ‘సిరీల్’ చాలెంజ్ వచ్చింది. బర్డ్ బాక్స్ చాలెంజ్ లో…కళ్లకు గంతలు కట్టుకుని వివిధ పనులు చేయడమే ఈ ఆట ప్రత్యేకత. ఒకమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని కారు నడిపి గోడను గుద్దేసింది. ఇది అమెరికాలోని ఉటా రాష్ట్రంలో జరిగింది. అమ్మాయి తలకి గాయాలయ్యాయి. కారు తుక్కు తుక్కు అయిపోయింది. 2016 ప్రాంతంలో బ్లూ వేల్ ఆట ఇంటర్ నెట్ ను కుదిపేసింది. ఇందులో చేతిమీద తిమింగలం బొమ్మ గీయించుకుని ఆడటం జరిగేది. చివరికి ఆటగాడి మృతితో ఆట ముగుస్తుంది. దేశంలో చాలా మంది పిల్లలు, యువకులు ఈ ఆట ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కికి చాలెంజ్ కూడా ఇలాంటిదే.

ఏమిటీ స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్, ట్రిప్పింగ్ జంప్ ?

ఈ ఛాలెంజ్, ఫ్రాంక్ లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. మధ్యలో వ్యక్తి గాల్లో ఎగిరినప్పుడు చెరోవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిన వ్యక్తి కాళ్లని కొడతారు. గాల్లో ఎగిరిన ఆ వ్యక్తి వారి నుంచి తప్పించుకోవాలి లేకోపోతే నేలమీద గట్టిగా పడతాడు. అలా నేల మీద పడినప్పుడు తల పగిలే అవకాశముంది లేదా చేతులు విరిగే అవకాశ ముంటుంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కువగా స్కూలు పిల్లలు దీన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ వీడియోలు కన్పించడంతో తల్లిదండ్రులు, డాక్టర్లు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకింత క్రేజ్ ?

ఈ స్కల్ బ్రేకర్ గేమ్ ఛాలెంజ్ కాస్త కొన్ని యాప్ లలో కి చేరడంతో ఇది మరింత పాపులర్ అయిపోయింది. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఈ గేమ్ లో పాల్గొన్న వారిలో చాలా మంది పుర్రెకు సంబంధించిన గాయాలతో పాటు నడుముకు సంబంధించిన గాయాలపాలయ్యారు.

ఎముకలు విరిగే ప్రమాదం..

స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్, ట్రిప్పింగ్ జంప్ లో భాగంగా స్టంట్లు చేయడంతో తల, చేతి ఎముకలు విరిగే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఛాలెంజ్ తీసుకుని వెనక్కు పడితే ఒంట్లోని కీళ్లన్నీ విరిగిపోతాయి. నడుము ఎముకలతో పాటు మోకాళ్లు, మోచేతులు, ఇతర కీళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంకో ఎముకతో ఎముకను కలిపే లిగమెంట్లు తెగిపోయే ప్రమాదముంటుంది. నేలపై పడిన వ్యక్తికి నడుము, మోకాలి చీలమండకు సంబంధించిన గాయాలు కూడా అయ్యే ప్రమాదాలు ఎక్కువ. కొన్ని సార్లు తలకు బలమైన గాయమై చనిపోవచ్చు లేదా జీవితాతం బెడ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.  ఇటీవల స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లో వెనిజులా కుర్రాడు తలకు తీవ్రమైన గాయమయ్యింది. ఈ ఆటకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

 సూచనలు..

…ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ స్కల్ బ్రేకర్ బారి నుండి తప్పించుకోవచ్చు. కొన్ని యాప్ లలో వీడియోలు ఎక్కువగా చేసేవారు, ముఖ్యంగా చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్ లో పాల్గొనవద్దు.

…పిల్లల పట్ల జాగ్రత్త… ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ యొక్క వీడియోలు అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతున్నాయి. పిల్లలు ఇలాంటి స్టంట్లను ప్రయత్నించకుండా అవగాహన కల్పించాలి.

…ఈ ఛాలెంజ్ పై తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

…ఈ తరహా చాలెంజ్ లకు సంబంధించిన వీడియోలు తీసినా, ప్రచారం చేసినా చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఏదేని సాయం కోసం 100 కాల్ చేయాలని లేదంటే సైబరాబాద్ వాట్సాప్ 94906 17444 నంబర్ కు వాట్సాప్ చేయాల్సిందిగా సూచించారు.

Latest Updates