బ‌ట్ట‌ల‌తో తాడు క‌ట్టి.. సినీ ఫ‌క్కీలో ఆస్ప‌త్రి నుంచి క‌రోనా పేషెంట్ ప‌రారీ

సినిమాల్లో హీరోయిన్ల‌ను వాళ్ల ఇంటి నుంచి త‌ప్పించి తీసుకెళ్ల‌డానికి వాడే టెక్నిక్ అది. చీర‌ల‌ను తాడులా క‌ట్టి.. ఇంటి కిటికీ లేదా బాల్క‌నీలో క‌ట్టి కిందికి జారి ప‌రార‌య్యే సీన్ చాలా సినిమాల్లోనే చూసుంటాం. అయితే ఈ టెక్నిక్ ని ఓ క‌రోనా పేషెంట్ వాడి ఆస్ప‌త్రి నుంచి ప‌రార‌య్యాడు. యూపీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

నేపాల్ నుంచిత‌బ్లిగీ జ‌మాత్ స‌ద‌స్సుకు వ‌చ్చి…

గ‌త నెల‌లో ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ లో జ‌రిగిన త‌బ్లిగీ జ‌మాత్ స‌ద‌స్సుకు హాజ‌రైన నేపాల్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు క‌రోనా బారిన‌ప‌డ్డాడు. అత‌డికి యూపీలోని బాఘ్ ప‌థ్ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అత‌డు ఆస్ప‌త్రిలోని బెడ్ షీట్లు, అత‌డి దుస్తుల‌ను క‌లిపి తాడులా చేసి కిటికీ అద్దాన్ని ప‌గుల‌కొట్టి.. దానికి వేలాడ‌దీసి కింద‌కి జారి ప‌రార‌య్యాడని ఆస్ప‌త్రి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఆర్కే టాండ‌న్ తెలిపారు. 17 మంది నేపాలీల‌తో క‌లిసి అత‌డిని శుక్ర‌వారం పోలీసులు ఆస్ప‌త్రిలో చేర్చార‌ని ఆయ‌న చెప్పారు. అత‌డికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఐసోలేష‌న్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని, ఇన్ని రోజుల్లో ఎప్పుడూ తేడాగా ప్ర‌వ‌ర్తించింది లేద‌ని తెలిపారాయ‌న‌.

గాలించి ప‌ట్టుకున్న పోలీసులు…

క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన పేషెంట్ త‌ప్పించుకోవ‌డంతో ప్ర‌భుత్వాధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అత‌డు బ‌య‌ట ఎక్క‌డైనా జ‌నంలో తిరిగితే వైర‌స్ వ్యాపించే ప్ర‌మాదం ఉండ‌డంతో అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌ను రంగంలోకి దించారు. దీనిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి.. చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోకి సెర్చ్ టీమ్స్ ను పంపిన‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు. హాస్పిట‌ల్ నుంచి మూడు కిలోమీట‌ర్ల దూరంలో అత‌డిని మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుర్తించి, మ‌ళ్లీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రి నుంచి త‌ప్పించుకుని పారిపోవ‌డంతో ఇప్పుడు అత‌డిని కిటికీలు ఏవీ లేని గ‌దిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్ట‌ర్లు.

Latest Updates