హైదరాబాద్ లో డార్క్ రెస్టారెంట్ : పనిచేసేవాళ్లంతా అంధులే

అదో రెస్టారెంట్. అక్కడ పనిచేసేవారంతా అంధులే. రెస్టారెంట్లోకి అడుగు పెడితేచాలు అంతా చీకటిమయం. ఓవైపు అప్యాయంగా పలుకరించే రెస్టారెంట్ ఆర్గనైజర్లు..మరోవైపు ప్రేమతో వడ్డించే సర్వర్లు. రెస్టారెంట్లోకి వెళితే చాలు వింత అనుభూతి కలుగతుంది. ఇవన్నింటి గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్  బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లోని డార్క్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే.

ఈ రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే చిమ్మ చీకటే కనిపిస్తోంది. ఒకరి భుజాన్ని మరోకరు పట్టుకొని లోనికి వెళుతుంటే రెస్టారెంట్ ఆర్గనైజర్ గైడ్ లా వ్యవహరిస్తుంటాడు. చీకట్లో నడిచి వెళుతుంటే గోడకు వేసిన విగ్రహాలను చేతితో స్పర్షిస్తూ వాటిని గుర్తించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. సిటీలోని ఎన్నో థీమ్డ్ రెస్టారెంట్లకు డార్క్ రెస్టారెంట్ డిఫరెంట్ గా ఉంటుంది.  రెస్టారెంట్లో ఎటూ చూసినా చీకటే కనిపిస్తుంది. టేబుల్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆర్డర్ వచ్చేలోగా ఆర్గనైజర్ కొన్ని టాస్కులు ఇస్తాడు. ఆ టాస్కులను ఆడుతుంటే చూపులేకున్న అంధుల జీవితాలు ఎలా ఉంటాయో అర్థం అవుతుంది.  డార్క్ రెస్టారెంట్ లో పని చేయడంతో ఆత్మస్థైర్యం పెరిగిందంటున్నారు  సిబ్బంది. అంధుల కోసం పనిచేసే రెస్టారెంట్లో పనిచేయడం సంతోషంగా ఉందంటున్నారు. అంధత్వంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్వీ కృష్ణన్ ఈ డైలాగ్ ఇన్ ద డార్క్ సంస్థను ఏర్పాటు చేశారు. గత నెల 23న డార్క్ థీమ్ రెస్టారెంట్ ను సీఎస్ ఎస్ కె జోష్ , టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు

అంధుల రెస్టారెంట్ అంటే పుడ్ ఎలా ఉంటుందోననే సందేహమే అవసరం లేదు. చెఫ్ లు అందరూ మాములు వ్యక్తులే. సర్వ్ చేసేది.. గైడ్ లా వ్యవహరించేది మాత్రం అంధులే. రెస్టారెంట్లో ఫుడ్ బాగుందని..చీకట్లో తినేప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమంటున్నారు కస్టమర్లు. అంధుల అభివృద్ది కోసం కృషి చేస్తున్న రెస్టారెంట్ ఓనర్ ఎస్వీ కృష్ణన్ ను జనం అభినందిస్తున్నారు.

Latest Updates