హిందూజాల చేతికి జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌

  • బిడ్డర్లతో ఎస్ బీ ఐ రుచులు
  • డార్విన్ గ్రూప్‌, హిందూజాలతో కలిసేందుకు లెండర్స్, ఎతిహాద్  ఆసక్తి
  • సరియైన కమిట్‌ మెంట్  ఇవ్వలేకపోతోన్న హిందూజా
  • మరిన్ని వివరాలు కావాలంటోన్న డార్విన్‌

‘జెట్‌ ’ను పైకి ఎగిరేలా చేయడానికి బ్యాంక్‌ ల కన్సార్షియం లీడర్‌‌ ఎస్‌‌బీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది. బిడ్డింగ్ దాఖలు చేసిన ఎతిహాద్ కేవలంమైనార్టీ వాటాలను పొందేందుకు మాత్రమే ఆసక్తి చూపడంతో, మిగిలిన వాటాలనుఇంకెవరికైనా ఇవ్వాలని చూస్తోంది. దీని కోసం జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌పై ఆసక్తి ఉన్నమరి కొంతమంది బిడ్డర్లతో ఎస్‌‌బీఐ చర్చలు జరుపుతోంది.

ఎతిహాద్ పార్టనర్‌‌‌‌‌‌‌‌గా ఉంటామంటూ ముందుకొచ్చిన అడిగ్రో ఏవియేషన్‌‌‌‌తో సమావేశమైన ఎస్‌‌‌‌బీఐ, తాజాగా ముంబైకి చెందిన డార్విన్ గ్రూప్‌‌‌‌తో కూడా చర్చలు జరిపినట్టు తెలిసింది. బుధవారం డార్విన్ ప్లాట్‌‌‌‌ఫామ్ గ్రూప్ అధికారుల, ఎస్‌‌‌‌బీఐ అధికారుల  సమావేశం జరిగింది. డార్విన్ గ్రూప్‌‌‌‌కు ఇప్పటికే ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ రియాల్టీ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. డార్విన్ గ్రూప్, ఇతరులు మూతపడిన ఈ విమానాయాన సంస్థను కొనేందుకు రూ.14వేల కోట్లు ఆఫర్ చేసినట్టు ఆ సంస్థ సీఈవో రాహుల్ గణపులే చెప్పారు. ఈ గ్రూప్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌‌‌‌(ఈఓఐ)లో పాల్గొని, మే 8న తన ఫైనాన్సియల్ బిడ్స్‌‌‌‌ను దాఖలు చేసింది. ‘ఎస్‌‌‌‌బీఐ అధికారులు మమ్మల్ని పిలిచారు. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఆస్తులు, అప్పుల గురించి మేము అర్థం చేసుకోవాల్సి ఉంది’ అని గణపులే చెప్పారు. పబ్లిక్‌‌‌‌గా అందుబాటులో లేని మరికొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఇతరుల వద్ద కేవలం ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ గురించి పరిమితమైన సమాచారం మాత్రమే ఉందని,  జెట్ సామర్థ్యం గురించి మరింత సమాచారం ఇవ్వాలని ఎస్‌‌‌‌బీఐ అధికారులను కోరినట్టు గణపులే తెలిపారు. మూతపడిన ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ సంస్థ పూర్తి బాధ్యతను టేకోవర్ చేసుకునేందుకు గ్రూప్ రూ.14వేల కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు
పేర్కొన్నారు.

హిందూజా గ్రూప్‌‌‌‌తో కూడా చర్చలు…

అటు హిందూజా గ్రూప్‌‌‌‌తో కూడా జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ లెండర్స్, ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ చర్చలు జరుపుతున్నాయి. హిందూజా గ్రూప్‌‌‌‌కు కూడా జెట్‌‌‌‌లో వాటాలను ఆఫర్ చేసేందుకు ఈ చర్చలను జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే జెట్‌‌‌‌లో పెట్టుబడి పెట్టేందుకు హిందూజా గ్రూప్‌‌‌‌ ఎలాంటి స్పష్టమైన కమిట్‌‌‌‌మెంట్ ఇవ్వడం లేదు.  ఎతిహాద్ ప్రతినిధులు హిందూజా గ్రూప్ హెడ్‌‌‌‌ జేపీ హిందూజాను కలవడంతో, తొలుత కొంత ఆసక్తి చూపించినా, ఆ తర్వాత స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతోంది. ‘హిందూజా గ్రూప్‌‌‌‌ ఎలాంటి కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వలేకపోతోంది. కానీ దానికి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి’ అని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మరికొన్ని రోజుల్లో ఎతిహాద్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌లు, జెట్ లెండర్స్‌‌‌‌.. హిందూజా గ్రూప్‌‌‌‌తో సమావేశమవుతారని, అయితే సమావేశ తేదీలను ఇంకా నిర్ణయించలేదని పేర్కొన్నారు. సంబంధిత మరో వ్యక్తి అధికారికంగా ఎలాంటి సమావేశం కానీ డైలాగ్స్‌‌‌‌ కానీ లేవని చెప్పారు.  హిందూజా గ్రూప్ గ్లోబల్‌‌‌‌గా ఆటోమోటివ్, ఆయిల్ అండ్ స్పెషాలిటీ, కెమికల్స్, మీడియా, ఐటీ, పవర్, హెల్త్‌‌‌‌కేర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో 10 వ్యాపారాలను నిర్వహిస్తోంది. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద ట్రక్ మానుఫ్యాక్చరర్ అయిన అశోక్ లేల్యాండ్ వీరిదే.

నాకున్న నైపుణ్యంతో జెట్‌‌‌‌ను బయటపడేస్తా…

అడిగ్రో, డార్విన్, హిందూజా గ్రూప్‌‌‌‌ల నుంచే కాకుండా… రష్యన్ ఏవియేషన్ ప్రొఫెషినల్ ఒలేగ్ ఎవ్డోకిమోవ్ నుంచి కూడా ఆసక్తిని ఎస్‌‌‌‌బీఐ అధికారులు పొందారు. తాను బిడ్డర్ కాకున్నప్పటికీ, తనకున్న నైపుణ్యంతో మూతపడిన ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ను కోలుకునేలా చేస్తానని ఒలేగ్ అన్నారు. తనకు షేర్లు వద్దని చెప్పారు. ఆసియా, ఆఫ్రికాలకు చెందిన రెండు ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌కు సాయం చేస్తానని హామీ ఇచ్చానని, అలాగే జెట్‌‌‌‌ పునరుద్ధరణకు కూడా సాయం చేయాలనే ప్లాన్‌‌‌‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్‌‌‌‌బీఐకి లేఖ కూడా రాశారు. ‘ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఆఫర్ చేసే మనీ చాలు. ఫండ్స్‌‌‌‌ను సేకరించడానికి మరికొన్ని మార్గాలున్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లను అమ్మడం, లోయల్టీ ప్రొగ్రామ్ జెట్ ప్రివిలైజ్‌‌‌‌లో వాటాలను అమ్మడం వంటివి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

జెట్‌‌‌‌ను కొనేందుకు ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌తో పాటు పలు పార్టీల నుంచి బిడ్స్‌‌‌‌ పొందినట్టు గత వారమే ఎస్‌‌‌‌బీఐ చెప్పింది. ఈ బిడ్స్‌‌‌‌ను సోమవారం పరిశీలించిన లెండర్స్, ఎతిహాద్ బిడ్ కండీషనల్‌‌‌‌గా ఉందని గుర్తించారు. ప్రస్తుతం జెట్‌‌‌‌లోని 51 శాతం వాటాలు అప్పులిచ్చిన లెండర్స్ చేతిలో ఉన్నాయి. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎక్స్‌‌‌‌ప్రెషన్ ఆఫ్ ఇంటరస్ట్‌‌‌‌లను ఆహ్వానించారు. నాలుగు ప్రిలిమినరీ బిడ్స్‌‌‌‌ను పొందారు. ఫైనాన్సియల్ బిడ్స్‌‌‌‌ వేయడానికి ఆఖరు తేదీ మే 10. వాటాల అమ్మకం ప్రక్రియలో భాగంగా 31.2 శాతం నుంచి 75 శాతం వాటాలను లెండర్లు ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న జెట్ మూలనపడింది. తొలి రౌండ్ బిడ్డింగ్‌‌‌‌లో ఇండిగో పార్టనర్స్, టీపీజీ, ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్, సావరీన్ ఫండ్ ఎన్‌‌‌‌ఐఐఎఫ్​లు షార్ట్‌‌‌‌లిస్ట్ అయ్యాయి. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌కు రూ. 8 వేల కోట్లకు పైగా రుణాలున్నాయి.

జెట్‌ కు గుడ్‌‌బై చెప్పేస్తున్నారు…

టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లే జెట్‌‌ను వీడటంతో..ఉద్యోగులు, పైలెట్లు కూడా జెట్‌‌కు గుడ్‌‌బై చెప్పడం ప్రారంభించేశారు. కేవలం మంగళవారమే 100 మంది ఫస్ట్ ఆఫీసర్ పైలెట్లు తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. మే 1 నాటికి 1,019 పైలెట్లు ఉంటే,ఇప్పుడు సుమారు 700 నుంచి 800 ఉండొచ్చని ఓ సీనియర్ ఎగ్జిక్యూ టివ్ చెప్పారు. కంపెనీకి అసలు 1,800 మంది పైలెట్లు ఉండేవారు. దేశవ్యాప్తంగా జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ పైలెట్ల రాజీనామా పరంపర కొనసాగుతోంది. తనకు తెలిసి 90 శాతం పైలెట్లు తమ రాజీనామా పత్రాలపై సంతకం చేసుంటారు. మిగతా వారు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని జెట్‌‌కు గుడ్‌‌ బై చెబుతున్న ఓ పైలెట్ చెప్పారు. క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌‌ కూడా రాజీనామాలు చేస్తున్నారు. ప్రస్తుతం జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ ఉద్యోగుల సంఖ్య ఈ నెల ప్రారంభానికి 12 వేలకు పడిపోయింది. జెట్ టాప్‌‌ లీడర్లు సీఈవో వినయ్ దుబే, సీఎఫ్‌‌ఓ అమిత్ అగర్వాల్, హెచ్‌‌ఆర్ హెడ్‌‌ రాహుల్ తనేజాలు జెట్‌‌ను వీడారు. విదేశీ కార్యాలయాల్లో ఉద్యోగులను కంపెనీనే తొలగిస్తోంది. విదేశీ ఆఫీసుల్లో పనిచేసే 50 మంది ఉద్యోగులను రాజీనామా చేయమని జెట్‌‌ ఆదేశించినట్టు తెలిసింది.

Latest Updates