సింగరేణిలో రెండు రోజుల ముందే పండగొచ్చింది

ఇప్పటికే అందిన దసరా అడ్వాన్స్​

నవంబరులో అందనున్న దీపావళి బోనస్​

మందమర్రి, వెలుగు:  రోజుల ముందే సింగరేణి ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రూ.25 వేల చొప్పున దసరా అడ్వాన్స్ అందుకున్న సింగరేణి కార్మికులకు లాభాల వాటాతో పాటు మార్చి నెలలో కోత విధించిన సగం వేతనాలను బ్యాంకు అకౌంట్​లో శుక్రవారం జమ చేసేందుకు సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. మరో 20 రోజుల్లో  దీపావళి బోనస్ అందనుంది. మొత్తంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సుమారు రూ. 850 కోట్ల ఆర్థిక ప్రయోజనాలను అందుకోనున్నారు. లాభాల వాటా, దసరా అడ్వాన్స్​తోపాటు తమ కష్టార్జితం మార్చిలో కోత విధించిన సగం వేతనం ఒకేసారి  చేతికి రానుండడంతో 43 వేల కార్మిక కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

మస్టర్ల ప్రాతిపదికన 82 శాతం..

2019–20 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికుల వాటాను శుక్రవారం యాజమాన్యం కార్మికుల బ్యాంకు అకౌంట్​లో జమ చేయనుంది. రూ.993 కోట్ల సింగరేణి లాభాల్లో ప్రభుత్వం కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటా రూపంలో రూ.278.28 కోట్లు అందనున్నాయి. ఇందులో  82 శాతం మస్టర్లపై రూ.227.96 కోట్లు, 14 శాతం ఉత్పత్తిపై రూ.38.96 కోట్లు, ఇన్సెంటివ్​పై 4 శాతం రూ.11.12 కోట్లు కార్మికులకు  అందనున్నాయి. అండర్ గ్రౌండ్​గనుల్లో పనిచేసే కార్మికులకు ప్రతి మస్టర్​పై రూ.227.70 చొప్పున చెల్లిస్తారు. ఓపెన్​ కాస్ట్​ గనుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి మస్టరుపై రూ.180.26 చొప్పున, డిపార్ట్​మెంట్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి మస్టరుపై రూ.166.39 చొప్పున పంపిణీ చేయనున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరం 100 మస్టర్లు పూర్తి చేసిన కార్మికులు లాభాల వాటా పొందేందుకు అర్హులు. ఒక్కో కార్మికుడికి రూ.50 వేల వరకు వాటా మొత్తం అందనుంది. అలాగే మార్చి నెలకు సంబంధించిన వేతన బకాయిలు రూ.158 కోట్లు సైతం ఉద్యోగుల బ్యాంకు అకౌంట్​లో జమ కానున్నాయి.

అందిన దసరా అడ్వాన్స్​

సింగరేణిలో ప్రతి ఏటా కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్​చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థలో పనిచేసే ప్రతి పర్మినెంట్​కార్మికుడికి ఈసారి రూ. 25 వేల చొప్పున, బదిలీ వర్కర్​కు రూ.12,500 చొప్పున వారి అకౌంట్లలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికే  జమ చేసింది. అడ్వాన్స్​గా అందించిన సొమ్మును కార్మికుల నుంచి నెలనెలా సమాన వాయిదాల్లో సింగరేణి తిరిగి వసూలు చేసుకుంటుంది.

దీపావళి బోనస్​ రూ.332 కోట్లు

సింగరేణి ఉద్యోగులకు నవంబర్​లో దీపావళి బోనస్​ అందనుంది. దేశంలోని బొగ్గు పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్యాలు ప్రతి ఏటా ఇచ్చే పెర్ఫార్మెన్స్​లింక్​డ్​రివార్డ్(పీఎల్ఆర్​) ఈ దఫా రూ.68,500గా నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని కోలిండియాలో దసరా లాభాల బోనస్​గా పరిగణిస్తుండగా.. సింగరేణిలో మాత్రం దీపావళి కానుకగా పేర్కొంటారు. వచ్చే దీపావళి పండుగకు ముందు నవంబర్​ రెండో వారంలో కార్మికులకు ఈ బోనస్​ చెల్లించనుంది.

Latest Updates