రాజారాం లో దశావతారాలు

శ్రీమహావిష్ణువుకి పది అవతారాలు. ఒక్కో క్షేత్రంలో ఒక్కో అవతారంలో కొలువుదీరుతాడు. అందుకే అన్ని అవతారాలను ఒకేచోట చూడడం చాలా అరుదు. కానీ.. ఇక్కడ మాత్రం స్వామివారు పది అవతారాల్లో దర్శనమిస్తున్నారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. తూర్పున ప్రాణహితమ్మ పరుగులు పెడుతుంటుంది. పశ్చిమాన ఎల్లమ్మగుట్ట, దక్షిణాన అందచందాల గిరిజన గ్రామం. ఉత్తరాన పచ్చని అడవి తల్లి.. ఇవన్నీ ఆ ప్రాంత ప్రత్యేకతలు.

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో రాజారాం గ్రామం దగ్గరలో, ప్రాణహిత నదీ తీరాన శ్రీమహావిష్ణువు పది అవతారాల్లో కొలువుదీరాడు. రాష్ట్రంలోనే దశావతారాలు ఉన్న ఏకైక ప్రాంతం ఇది. 12, 13వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన సామంతరాజు ‘రాజారాం’ ఇక్కడ విగ్రహమూర్తులను ఏర్పాటు చేయించాడు. అయితే.. విగ్రహాలు చెక్కించడం పూర్తయిన తర్వాత పెద్ద ఆలయం నిర్మించాలన్నది ఆయన ఆలోచన. కానీ.. రాజ్యంలో ఏర్పడ్డ కరువు వల్ల ఈ ఆలయ నిర్మాణ పనులు తొలిదశలోనే ఆగిపోయాయి. ఆలయంలో ప్రతిష్ఠించడానికి చెక్కించిన విగ్రహాలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతం శ్రీమహావిష్ణువు దశావతారాల విగ్రహాలతోపాటు రేణుకా ఎల్లమ్మ, అన్నపూర్ణాదేవి, కళింగమర్ధనుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి.

ఏటా జూన్‌‌‌‌లో ఇక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం జాతర, రథోత్సవం చేస్తారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు శిథిలమైపోతున్నాయి. వాటిని బాగుచేసి, టూరిస్ట్ స్పాట్‌‌‌‌గా మారిస్తే ఈ ప్రాంతం చాలా డెవలప్‌‌‌‌ అవుతుంది.

 

Latest Updates