సుమేధ మృతి.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి సుమేధ చనిపోయిందని.. అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేన‌ని అన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. నేరేడ్ మెట్ దిన్ దాయల్ నగర్ లో రెండు రోజుల క్రితం నాలాలో పడి మృతి చెందిన సుమేధ కుటుంబ సభ్యులను పరామర్శించారు దాసోజు శ్రవణ్. ఆయ‌న‌తోపాటు కాంగ్రెస్ నాయకులు నంది కంటి శ్రీధర్ ,వసిం ఖాన్ ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ యాదవ్ లు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు, అనంత‌రం సుమేధ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ.. 60 వేల కోట్లు సిటీ కోసం ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. మరి సిటీ లో ఓపెన్ నాలాలు, రోడ్లు ఎందుకు అధ్వాన్నంగా ఉన్నాయని ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ను డల్హౌసీ,ఇస్తాంబుల్ చేస్తామ‌న్న మంత్రి కేటీఆర్.. సిటీలో వర్షం వస్తే కనీసం నాలాలకు పై కప్పులు కూడా లేవని విమ‌ర్శించారు.

తలసానికి తలకాయ లేదు

సుమేధ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ప్రభుత్వ హత్య అని అన్నారు. పాప మృతిపై కేటీఆర్, జీహెచ్ఎసి కమిషనర్,మేయర్ పై హత్య కేసు నమోదు చేయాల‌ని అన్నారు. వర్షం వస్తే నీళ్లు రాక మంటలు వస్తాయా అని అంటున్న మంత్రి తలసానికి తలకాయ లేదని అన్నారు శ్ర‌వ‌ణ్. సుమేధ తల్లిదండ్రులు ఆ పాప మృతితో ఎంతో బాధ పడుతున్నారని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Latest Updates