ఆ కాలేజీలో డేటింగ్ క్లాసులు

అది ఒక కాలేజ్​. అమ్మాయిలు, అబ్బాయిలంతా ఒకచోట చేరారు. ఆ తర్వాత అమ్మాయిలతో అబ్బాయిలు డేటింగ్​ మొదలుపెట్టేశారు. నాలుగు గంటల పాటు డేటింగ్​లో మునిగిపోయారు. అదేంటి కాలేజ్​లో డేటింగా? అన్న డౌట్​ వచ్చిందా. అవును, అచ్చంగా డేటింగే. కానీ, అది ఆ కాలేజ్​ పెట్టిన కోర్సు అది. ‘జెండర్​ అండ్​ కల్చర్​’ అనే కోర్సులో భాగంగా డేటింగ్​, లవ్​, శృంగారంపై క్లాసులు చెబుతోంది ఆ కాలేజ్​. దక్షిణ కొరియాలోని సెజాంగ్​ యూనివర్సిటీ ఈ స్పెషల్​ డేటింగ్​ కోర్సును ప్రవేశపెట్టింది.

డేటింగ్​ అయిపోగానే దానిపై స్టూడెంట్లు అసైన్​మెంట్లు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్లు డేటింగ్​ క్లాసులపై ఆసక్తి చూపిస్తున్నారని బే జియాంగ్​ వ్యూన్​ అనే లెక్చరర్​ చెప్పారు. ఇంతకుముందు డేటింగ్​ చేయని విద్యార్థులు తమకంటూ ఓ భాగస్వామిని సెట్​ చేసుకోవాలని చూస్తున్నారన్నారు. కొరియా ఇనిస్టిట్యూట్​ ఫర్​ హెల్త్​ అడ్​ సోషల్​ అఫైర్స్​ ప్రకారం దక్షిణ కొరియాలో 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్నోళ్లు ఎక్కువ మంది ఒంటరిగానే ఉంటున్నారట.

26 శాతం మంది పెళ్లికాని మగవాళ్లు, 32 శాతం మంది పెళ్లికాని ఆడవాళ్లు మాత్రమే రిలేషన్​లో ఉన్నారట. 51 శాతం మంది పురుషులు, 64 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారట. దానికీ ఓ కారణముంది. నిరుద్యోగం. 17 ఏళ్లలో అక్కడ నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. పదిలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వస్తోంది.

దీంతో ఉన్న టైం ఉద్యోగం వెతుక్కోవడానికే సరిపోతోందని, పైసల్లేక కష్టమవుతోందని, అట్లాంటి పరిస్థితుల్లో డేటింగ్​ కొయ్యను మెడకు ఎలా తగిలించుకోవాలని యూత్​ అంటున్నారు. ఉద్యోగం ఉన్నవాళ్లలోనూ 30 శాతం మందే డేటింగ్​లో బిజీ అయిపోతున్నారట. జాబ్​ మార్కెట్​లో పోటీ పెరిగిపోవడంతో కొందరు ఫ్రీ టైంలో ప్రొఫెషనల్​ నైపుణ్యాలు పెంచుకునేందుకు సర్టిఫికెట్​ కోర్సులు కూడా చేస్తున్నారు.

భద్రం కాదేమో...

చాలా మంది డేటింగ్​ అంత భద్రం కాదేమోనని భయపడుతున్నారు. లింగ వివక్ష, సెక్స్​ నేరాలు, రేప్​ల వంటి వాటిని ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు, డేటింగ్​లో ఉన్నోళ్లు తమ భాగస్వాములపై పాల్పడిన నేరాలనూ గుర్తు చేస్తున్నారు. తన స్నేహితురాలిపై ఆమె బాయ్​ఫ్రెండ్​ దాడి చేయడంతో తాను డేటింగ్​కు దూరంగా ఉంటున్నానని ఓ స్టూడెంట్​ చెప్పింది.

అంతేకాదు, కొందరు డేటింగ్​ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లూ ఉంటారని, తమను సీక్రెట్​గా అశ్లీలంగా ఫొటోలు, వీడియోలు తీసే ప్రమాదముందని అంటున్నారు. దీంతో వాటన్నింటిపైనా అవగాహన కల్పిస్తూ డేటింగ్​ క్లాసులు చెబుతున్నారు. సెక్స్​ ఎడ్యుకేషన్​నూ అందులో భాగం చేశారు. స్టూడెంట్లు పోర్న్​ వైపు వెళ్లకుండా ఇలాంటి క్లాసులు ఉపయోగపడతాయని యూనివర్సిటీ లెక్చరర్లు చెబుతున్నారు.