తొలి రోజే పట్టు బిగించారు.. 2–0 ఆధిక్యంలో టెన్నిస్‌‌ టీమ్‌‌

  • సింగిల్స్‌‌లో రామ్‌‌కుమార్‌‌, సుమిత్‌‌ గెలుపు
  • పాకిస్థాన్‌‌తో డేవిస్‌‌ కప్‌‌

ఓవైపు వరల్డ్‌‌ గ్రూప్‌‌ క్వాలిఫయర్స్‌‌కు అర్హత సాధించాలన్న లక్ష్యం.. మరోవైపు సీనియర్లు లేరన్న బాధ.. ఈ రెండింటికి మించి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌తో పోరు..! అయినా ఏమాత్రం తడబాటు లేకుండా చెలరేగిన ఇండియా టెన్నిస్‌‌ టీమ్‌‌ కుర్రాళ్లు తొలి రోజే ‘డేవిస్‌‌ కప్‌‌’లో పట్టు బిగించారు..! ఫేవరెట్‌‌ హోదాకు న్యాయం చేస్తూ.. ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా చేసుకుంటూ… ఆటలో ఆధిపత్యం చూపెడుతూ.. తిరుగులేని పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టారు..! ఇక మిగిలిన మూడు మ్యాచ్‌‌ల్లో ఒక్కటి నెగ్గినా.. టోర్నీలో మరో అడుగు ముందుకేసినట్లే..!!

నూర్‌‌ సుల్తాన్‌‌: జరుగుతుందో లేదోనన్న సందేహాల మధ్య మొదలైన డేవిస్‌‌ కప్‌‌లో ఇండియా శుభారంభం చేసింది. తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి పాకిస్థాన్‌‌పై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ.. 2–0 ఆధిక్యంలో నిలిచింది. గట్టి పోటీ ఇస్తామని బీరాలకు పోయిన దాయాది జట్టు… 24 గేమ్‌‌లు జరిగితే కేవలం రెండు మాత్రమే గెలిచి మూల్యం చెల్లించుకున్నది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి మ్యాచ్‌‌లో రామ్‌‌కుమార్‌‌ రామనాథన్‌‌ 6–0, 6–0తో మహ్మద్‌‌ షోయబ్‌‌పై గెలిచి ఇండియాను 1–0 ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న షోయబ్‌‌.. 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ ధాటికి తట్టుకోలేకపోయాడు. ఫలితంగా ప్రతి గేమ్‌‌లో రామ్‌‌కుమార్‌‌ ఆధిపత్యమే నడిచింది. ఆరో గేమ్‌‌లో కొద్దిగా పోటీ ఇచ్చినట్లు కనిపించిన షోయబ్‌‌.. రెండు డ్యూస్‌‌లను సాధించాడు. కానీ రామ్‌‌కుమార్‌‌ రిటర్న్స్‌‌ దెబ్బకు సర్వీస్‌‌ కోల్పోయాడు. రెండు, నాలుగు, ఆరో గేమ్‌‌లో షోయబ్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసిన రామ్‌‌కుమార్‌‌ అలవోకగా తొలిసెట్‌‌ను సాధించాడు. రెండో సెట్‌‌ దీనికి భిన్నంగా ఏమీ జరగలేదు. పవర్‌‌పుల్‌‌ బ్యాక్‌‌హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయిన రామ్‌‌కుమార్‌‌.. తొలి గేమ్‌‌లో సర్వీస్‌‌ను నిలబెట్టుకున్నాడు. రెండో గేమ్‌‌లో షోయబ్‌‌ సర్వీస్‌‌ను నెట్‌‌ కొట్టి రామ్‌‌కుమార్‌‌  డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేశాడు. ఆ వెంటనే షోయబ్‌‌ బ్రేక్‌‌ పాయింట్‌‌ సాధించి స్కోరు సమం చేసినా సర్వీస్‌‌ నిలబెట్టుకోలేకపోయాడు. మూడో గేమ్‌‌లో పాక్‌‌ ప్లేయర్‌‌కు ఒక్క పాయింట్‌‌ ఇవ్వకుండా సర్వీస్‌‌ను కాపాడుకున్న రామ్‌‌కుమార్‌‌.. నాలుగో గేమ్‌‌లో బ్రేక్‌‌ పాయింట్‌‌ను కాచుకున్నాడు. షోయబ్‌‌ డబుల్‌‌ ఫాల్ట్‌‌తో సర్వీస్‌‌ను కోల్పోయాడు. ఐదో గేమ్‌‌లో బలమైన ఏస్‌‌తో షోయబ్‌‌ను కట్టడి చేసిన రామ్‌‌కుమార్‌‌.. ఆరో గేమ్‌‌లో మళ్లీ పాక్‌‌ ప్లేయర్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి మ్యాచ్‌‌ను సొంతం చేసుకున్నాడు.

రెండు గేమ్‌‌లే..

రెండో సింగిల్స్‌‌లో సుమిత్‌‌ నగల్‌‌ 6–0, 6–2తో హుజైఫా అబ్దుల్‌‌ రెహమాన్‌‌ను ఓడించి ఇండియాను 2–0 ఆధిక్యంలో నిలిపాడు. నగల్‌‌కు ఇది తొలి డేవిస్‌‌ కప్‌‌ విన్​.  గంటా 4 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో నగల్‌‌ ఒకటి, మూడు, ఐదు గేమ్‌‌ల్లో రెహమాన్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి తొలి సెట్‌‌ను సాధించాడు. రెండో సెట్‌‌ తొలి గేమ్‌‌లో రెహమాన్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసిన నగల్‌‌ 2–0 ఆధిక్యంలో కి వెళ్లాడు. కానీ మూడో గేమ్‌‌లో రెహమాన్‌‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. నగల్‌‌ రెండు డబుల్‌‌ఫాల్ట్‌‌లు చేయడంతో పాక్‌‌ ప్లేయర్‌‌ సులువుగా సర్వీస్‌‌ను కాపాడుకుని ఆధిక్యాన్ని 2–1కి తగ్గించాడు. నాలుగో గేమ్‌‌ నగల్‌‌ సొంతమైనా.. ఐదో గేమ్‌‌లో బలమైన ఏస్‌‌తో రెహమాన్‌‌ సర్వీస్‌‌ను కాపాడుకున్నాడు. దీంతో స్కోరు 3–2గా మారింది. ఆరు, ఎనిమిది గేమ్‌‌ల్లో సర్వీస్‌‌తో పాటు ఏడో గేమ్‌‌లో రెహమాన్‌‌ సర్వీస్‌‌కు అడ్డుకట్ట వేయడంతో మ్యాచ్‌‌ నగల్‌‌ సొంతమైంది. మ్యాచ్‌‌ మొత్తంలో 4 ఏస్‌‌లు కొట్టిన నగల్‌‌.. 2 డబుల్‌‌ ఫాల్ట్‌‌లు చేశాడు. పది బ్రేక్‌‌ పాయింట్లలో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు. 2 ఏస్‌‌లతో సరిపెట్టుకున్న రెహమాన్‌‌.. 8 డబుల్‌‌ఫాల్ట్‌‌లతో మూల్యం చెల్లించుకున్నాడు. అలాగే ఒక్క బ్రేక్‌‌ పాయింట్‌‌ను కూడా సాధించలేకపోయాడు. శనివారం జరిగే డబుల్స్‌‌లో వెటరన్‌‌ లియాండర్‌‌ పేస్‌‌–జీవన్‌‌ నెడుంజెళియన్​..  పాక్​ జోడీ అబ్దుల్‌‌ రెహమాన్‌‌–మహ్మద్‌‌ షోయబ్‌‌తో తలపడతారు.

Davis Cup: Ramkumar, Sumit trample Pakistan on Day 1, India lead 2-0

Latest Updates