పగలు గంట కంటే ఎక్కువ పడుకోవద్దు.. 9 గంటల నిద్రా డేంజరే!

ప్రతి మనిషికి విశ్రాంతి అవసరమే.. కానీ అది ఎక్కువైనా ప్రమాదమే. ఏదైనా మితంగా చేస్తే మంచిది. అతి ఎందులోనూ పనికిరాదంటారు పెద్దలు. అదే విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మితిమీరిన విశ్రాంతి తీసుకున్నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని ఆరేళ్లపాటు చేసిన పరిశోధనలో తేల్చారు. ముఖ్యంగా పగటిపూట గంటన్నర కన్నా ఎక్కువ సమయం నిద్ర పోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందుకేనేమో మన పెద్దలు బద్ధకంగా పగలు పడకుంటే దరిద్రమని తిడుతుంటారు.

గంటలోపు ఓకే

చైనాలోని హూజాంగ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఆరేళ్లపాటు 31,750 మందిపై పరిశోదన చేశారు. ఈ స్టడీలో పాల్గొన్న వారంతా 60 నుంచి 62 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. వారిని రెండు భాగాలుగా విభజించి అధ్యయనం చేశారు. వారిలో స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తుల్ని పగలు పడుకునే అలవాటుపై ప్రశ్నించారు. రెగ్యులర్‌గా వారిని అబ్జర్వ్ చేశారు శాస్త్రవేత్తలు. వారి సమాధానాల ఆధారంగా పరిశోధన చేపట్టారు.

పగలు గంటన్నర కన్నా ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్లకి మిగతా వారితో పోలిస్తే 25 శాతం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే ఒక గంట అంతకంటే తక్కువ సమయం అలా పడుకుని రెస్టు తీసుకునే వాళ్లకు మాత్రం ఆ ప్రమాదంలో పెరుగుదల లేదని తెలిపారు. ముఖ్యంగా భోజనం తర్వాత పడుకుని పోవడం మంచిది కాదని వెల్లడించారు.

రాత్రి నిద్ర కూడా 9 గంటలకంటే ఎక్కువొద్దు

రాత్రి పూట కూడా అతి నిద్ర పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 9 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ 23 శాతం పెరుగుతుందని వారి పరిశోధనలో తేలింది. అయితే 7 నుంచి 8 గంటల సమయం నిద్రపోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిగా పడుకుని ఉంటే మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుందని తేల్చారు. అలాగే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకునిపోయే ప్రమాదం పెరుగతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య వయస్కులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్లు నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పగలు వీలైనంత తక్కువ నిద్రపోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాత్రి మంచిగా నిద్రపోవాలని, 7-8 గంటలకు మించి నిద్ర మంచిది కాదని చెబుతున్నారు.

కొన్ని కారణాలివి:

  • ఎక్కువగా పడుకుని సమయం గడిపేసే వారిలో కొలెస్ట్రాల్ సమస్యలను గుర్తించారు శాస్త్రవేత్తలు.
  • బ్రెయిన్‌కు రక్త సరఫరాలో ఇబ్బందులు, రక్తనాళాలపై ఒత్తిడి కూడా ప్రధాన కారణాలు.
  • ఎక్కువ సమయం పడుకునే వాళ్ల జీవన శైలి బద్ధకంగా సాగుతుందని, వ్యాయామం చేసే అలవాటు కూడా కష్టమేనని అంటున్నారు సైంటిస్టులు.
  • పగలు ఎక్కువ టైమ్ పడుకునే అలవాటుకు తోడు స్మోకింగ్ అలవాటు, షుగర్, బీపీ సమస్యలు ఉంటే స్ట్రోక్ వచ్చే చాన్స్ ఇంకా ఎక్కువ.

Latest Updates