ఒక్కొక్కరి తలపై అప్పురూ.23.5 లక్షలు

  • ప్రపంచపు అప్పు రూ.179 కోట్ల కోట్లు

ప్రపంచం అప్పుల్లో కూరుకుపోతోంది. చిన్నా, పెద్దా, ప్రైవేట్​, ప్రభుత్వం అన్న తేడా లేకుండా నానాటికీ అప్పుల మూట పెరిగి కొండ అవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచం మీద సుమారు రూ.179 కోట్ల కోట్ల రూపాయల (2.53 కోట్ల కోట్ల డాలర్లు) అప్పు ఉందట. ఒక్క 2019లోనే అప్పు సుమారు రూ.6.3 కోట్ల కోట్లకు (9 లక్షల కోట్ల డాలర్లు) పెరిగిందట. ఆ అప్పును ప్రపంచంలోని 770 కోట్ల మందికి లెక్కేస్తే ఒక్కొక్కరి తలపై దాదాపు రూ.23.50 లక్షల (32,500 డాలర్లు) దాకా అప్పుల కుప్ప పడుతుందట. గ్లోబల్​ డెట్​ టు జీడీపీ రేషియోపై ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇంటర్నేషనల్​ ఫైనాన్స్​ (ఐఐఎఫ్) అనే సంస్థ రిపోర్ట్​ విడుదల చేసింది. బ్యాంక్​ ఆఫ్​ ఇంటర్నేషనల్​ సెటిల్​మెంట్స్​ (బీఐఎస్​), ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) డేటా ఆధారంగా ప్రపంచం అప్పుల లెక్క తీసింది. ఇందులో వ్యక్తిగతంగా తీసుకునే ఓ కుటుంబం అప్పుల నుంచి కంపెనీలు, ప్రభుత్వం తీసుకునే అప్పుల దాకా వివరాలను వెల్లడించింది.

ఇంటి అప్పులు పెరుగుతున్నయ్​

ప్రస్తుతం జీడీపీలో ప్రపంచ అప్పు శాతం 322 శాతానికి చేరింది. 2016తో పోలిస్తే ఇప్పుడు అప్పు భారం మరింత ఎక్కువైంది. మొత్తం అప్పులో అమెరికా, యూరప్​ల వాటానే సగం దాకా ఉంటుందని ఐఐఎఫ్​ అంచనా వేసింది. జీడీపీలో వాటి అప్పు శాతం 383 శాతం దాకా ఉంటుందని లెక్క తేల్చింది. ఆ అప్పు విలువ సుమారు రూ.127 కోట్ల కోట్లు (1.8 కోట్ల కోట్ల డాలర్లు). దానికి కారణం కార్పొరేట్​ అప్పులు పెరిగిపోవడమేనని వెల్లడించింది. వాటితో పాటు ఇంటి అప్పులూ పెరుగుతున్నాయని ఐఐఎఫ్​ రిపోర్ట్​ పేర్కొంది. ఆ ట్రెండ్​ న్యూజీలాండ్​, స్విట్జర్లాండ్​, నార్వే, నైజీరియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్​, లెబనాన్​, స్వీడన్​లలో ఏటికేడాది ఇంటి అప్పులు (హౌస్​హోల్డ్​ డెట్​) పెరుగుతున్నాయని తెలిపింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్​, సింగపూర్​, స్వీడన్​, స్విట్జర్లాండ్​లలో నాన్​ఫైనాన్షియల్​ కార్పొరేట్​ అప్పులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నయ్​

ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు చేస్తున్న అప్పులూ ఎక్కువైపోతున్నాయని రిపోర్ట్​ పేర్కొంది. ప్రపంచం మొత్తంలో ప్రభుత్వ అప్పులే సుమారు రూ.49.5 కోట్ల కోట్లు (70 లక్షల కోట్ల డాలర్లు) ఉంటాయని చెప్పింది. అందులోనూ అమెరికా, ఆస్ట్రేలియా అప్పులే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఇక, ఎమర్జింగ్​ మార్కెట్లలో చైనా అప్పులు జీడీపీలో 310 శాతానికి పెరిగాయని రిపోర్ట్​ తెలిపింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చైనాలో కొంచెం స్లో డౌన్​ అయినా, దానిని తగ్గించేందుకు చైనా చేపట్టిన ఆర్థిక చర్యల వల్ల మళ్లీ అది ఎక్కువైందని పేర్కొంది. అందులో కార్పొరేట్​ అప్పులు పెరగడం వల్లే అప్పులు ఎక్కువయ్యాయని వెల్లడించింది. ఎమర్జింగ్​ మార్కెట్లలో మొత్తం అప్పు విలువ సుమారు రూ.51 కోట్ల కోట్లు (72 లక్షల కోట్ల డాలర్లు) ఉంటుందని చెప్పింది. ఇటీవలి కాలంలోనే ఆ అప్పులు మరింత పెరిగాయని చెప్పింది.

ఈ ఏడాది మరింత పెరుగుతది

అప్పుల్లో పెరుగుదుల ట్రెండ్స్​ అక్కడితో ఆగిపోదని ఐఐఎఫ్​ రిపోర్ట్​ తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఫస్ట్​ క్వార్టర్​) లోనే అప్పు విలువ సుమారు రూ.182 కోట్ల కోట్లను (2.57 కోట్ల కోట్ల డాలర్లు) దాటి పోయే అవకాశం ఉందని చెప్పింది. దానికి కారణం తగ్గుతున్న వడ్డీ రేట్లు, బాగాలేని ఆర్థిక పరిస్థితులేనని వివరించింది. ఫెడరల్​ రిజర్వ్​ పోయినేడాది మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గించిందని గుర్తు చేసింది. అంతేగాకుండా ఫైనాన్షియల్​ క్రైసిస్​ (ఆర్థిక సంక్షోభం) తర్వాత పెట్టుకున్న బెంచ్​మార్క్​ వడ్డీ రేట్ల కన్నా తక్కువ రేట్లనే ఇప్పుడు యూరోపియన్​ సెంట్రల్​ బ్యాంకు వేస్తోందని చెప్పింది. వాతావరణ మార్పులను డీల్​ చేయడానికి వివిధ దేశాలకు ఆర్థిక సమస్యలను తెచ్చి పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​కు సుమారు రూ.30 కోట్ల కోట్లు (42 లక్షల కోట్ల డాలర్లు) అవసరమవుతాయని,  పేద దేశాలకు అది ఇబ్బందేనని చెప్పింది.

Latest Updates