నెల రోజులు కష్టపడి చందాలు వేసుకొని మృతదేహం తరలింపు

తొమ్మిది నెలలుగా సౌదీలోనే డెడ్ బాడీ
గుండెపోటుతో నిర్మల్ యువకుడు మృతి

నర్సాపూర్(జి), వెలుగు: సౌదీలో గుండెపోటుతో మృతిచెందిన యువకుడి మృతదేహం 9 నెలల తర్వాత స్వగ్రామానికి చేరింది. నిర్మల్‍జిల్లా సిర్గాపూర్‍కు చెందిన చందాల చందు(31)కు భార్య సరిత, ఏడేళ్ల కొడుకు విష్ణు, నాలుగేళ్ల కూతురు వైష్ణవి ఉన్నారు. చందు 2018లో సౌదీకి వెళ్లాడు. రెండేళ్లలో తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. తొమ్మిది నెలల క్రితం గుండెపోటుతో చనిపోవడంతో కంపెనీ యజమాని కుటుంబసభ్యులకు ఫోన్​ద్వారా సమాచారం అందించాడు. అయితే తన భర్త ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎలా చనిపోయాడో తనకు పోస్టుమార్టం రిపోర్టు కావాలని భార్య కంపెనీ యజమానులకు చెప్పింది. ఈ క్రమంలో కంపెనీవారు చందు మృతదేహాన్ని హాస్పిటల్‍కు తరలించారు.

కానీ చందుకు సంబంధించిన వివరాలేవీ హాస్పిటల్‍ వారికి చెప్పకుండా యజమాని తప్పించుకోవడంతో 9 నెలలపాటు మృతదేహం హాస్పిటల్‍లోనే ఉండిపోయింది. భార్య, కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్‍ చేసిన అక్కడి నుంచి స్పందన కరువైంది. విషయం తెలుసుకున్న సౌదీ గల్ఫ్ కార్మికుల సంఘంవారు గత నెలలో హాస్పిటల్‍కు వెళ్లి చందుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కార్మికులంతా కలిసి రూ. 40 వేలు జమ చేసి మృతదేహం తరలించేందుకు నెల రోజులపాటు కష్టపడ్డారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆదివారం మృతదేహాన్ని ఇంటికి పంపించారు. సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Latest Updates