ఈత పోటీలో యువకుడి మృతి     

చెరువులో ఈత పోటీ ఓ యువకుడి ప్రాణం తీసింది. కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్ట ప్రాంతానికి చెందిన చించల్లి సాయిలు, సాయవ్వల ఏకైక కుమారుడు సాయి కుమార్(22). సోమవారం ఉదయం స్నేహితులతో హోలీ పండుగ చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లాడు. రాత్రంతా ఫ్రెండ్స్​తో ఉన్న సాయికుమార్ మంగళవారం ఉదయం కల్లు తాగడానికి పవన్, రాహుల్ తో కలిసి మాదాపూర్ శివారులోని చెరువు గట్టుకు వెళ్లాడు. కల్లు దొరకకపోవడంతో చెరువులో ఈత కొట్టాలని అనుకున్నారు. ఈత రాని రాహుల్ గట్టుపైన ఉండగా సాయి కుమార్, పవన్ చెరువు మధ్యలో ఉన్న చెట్ల వద్దకు వెళ్లి తిరిగి గట్టుకు రావాలని పోటీ పెట్టుకున్నారు. చెరువు మధ్యలో ఉన్న చెట్ల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పవన్ గట్టుకు చేరగా మధ్యలో ప్రమాదవశాత్తు సాయి కుమార్ నీటిలో మునిగిపోయాడు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని సర్పంచ్ దారిశేట్ట రాజేష్  సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీయించారు. మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పవన్, రాహుల్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కొండపాకలో మరొకరు..

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లిలో  ఓ యువకుడు చెరువులో పడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్​ రైతు. ఈయనకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు భాను(21) డిగ్రీ కంప్లీట్​చేశాడు. సోమవారం ఉదయం బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు అందులో జారిపడి చనిపోయాడు. బయటకు వెళ్లిన భాను తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో గ్రామ సమీపంలో చెరువులో మృతదేహం తేలిఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates