నెహ్రూ జూపార్కులోని బెంగాల్ టైగర్ మృతి

చాంద్రాయణగుట్ట, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో 11 ఏళ్ల వయసున్న రాయల్ బెంగాల్ టైగర్ కదంబ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఎల్లో టైగర్ కు శనివారం రాత్రి 9:20 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో మరణించిందని జూ అధికారులు ఆదివారం తెలిపారు. జంతు మార్పిడి పథకంలో భాగంగా 2014 మార్చి 6న కర్నాటకలోని మంగళూరు పిలుకల బయాలాజికల్ పార్కు నుంచి కదంబను తీసుకొచ్చారు. ఇది గత10 రోజులుగా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడంతో వెటర్నరీ డాక్టర్ల పరిశీలనలో ఉంచారు. సోమవారం అన్ని రకాల పరీక్షలు చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే టైగర్ మరణించింది. రాజేంద్రనగర్ లోని వెటర్నరీ కాలేజీ పాథాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. గుండెపోటుతోనే టైగర్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని పరీక్షల కోసం శాంపిళ్లను వెటర్నరీ కాలేజీ, వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, అత్తాపూర్లోని లాకోన్స్-– సీసీఎంబీకి పంపించారు. కాగా, జూలో ఇటీవలే రాయల్ బెంగాల్ వైట్ టైగర్ మృతి చెందింది.

జూలో 20 రాయల్ బెంగాల్ టైగర్స్ 

ప్రస్తుతం జూపార్కులో మొత్తం 20 రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో ఎల్లో టైగర్స్ 11 ఉండగా.. అందులో 8 పెద్దవి, 3 చిన్నవి ఉన్నాయి. ఎల్లో టైగర్లలో రోజా (21), సోనీ (20), అపర్ణ (19) చాలా పెద్దవి. వీటితో పాటు 9 రాయల్ బెంగాల్ వైట్ టైగర్స్ ఉన్నాయి.

Latest Updates