వ్యవసాయ బిల్లులతో రైతులకు మరణ శాసనం

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజకీయ రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతులు నిరసనలు చేస్తున్నారు. బిల్లులను నిరసిస్తూ కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీదల్ నేత హర్‌‌సిమ్రత్ కౌర్ బాదల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజ్యసభలో సదరు బిల్లుల్లో నుంచి రెండింటిని ప్రవేశపెట్టారు. వీటిపై వాడివేడి చర్చతో సభ వేడెక్కింది. ఈ బిల్లులను రైతులకు విధించిన మరణ శాసనంగా కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా విమర్శించారు.

‘ఈ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తోంది. రైతులకు మరణ శాసనమైన వీటిపై మేం సంతకాలు చేయబోం. రైతులకు మేలు చేకూర్చుతుందని చెబుతున్న సదరు బిల్లులను ఫార్మర్స్ కోరుకోవట్లేదు. అలాంటప్పుడు ఎందుకు రైతులపై వీటిని రుద్దుతున్నారు. రైతులు నిరక్షరాస్యులు కాదు. కనీస మద్దతు ధరకు ఈ బిల్లులు దూరంగా ఉన్నాయని వారికి అర్థమైంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే రైతు భూములపై కార్పొరేట్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తారు. అగ్రికల్చర్, మార్కెట్లు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. ఫెడెరల్ కోఆపరేటివ్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది’ అని బజ్వా పేర్కొన్నారు.

Latest Updates