
- మంచిర్యాల జిల్లాలో 16,900 దరఖాస్తులు
- పది వేలకుపైగా వెరిఫికేషన్ పూర్తి
- 1,671 యాక్సెప్ట్, 1,500 రిజెక్ట్
- సాదాబైనామా, పీవోటీ, న్యూ అసైన్మెంట్ పెండింగ్
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 49,178 దరఖాస్తులు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో జిల్లాలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. జూన్3 నుంచి 20 వరకు జిల్లాలోని 383 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
రెవెన్యూ అధికారులు గత రెండు నెలలుగా వీటిపైనే ఫోకస్‌పెట్టి సమస్యలను పరిష్కరిస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు ఇదే పనిలో బిజీగా ఉంటున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు మోక్షం కలగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 16,900 అప్లికేషన్లు
భూ భారతి చట్టంలో భాగంగా తొలుత భీమారం మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసి మే 5 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మండలంలోని 16 గ్రామాల నుంచి 2,148 అప్లికేషన్లు వచ్చాయి. అనంతరం జూన్ 3 నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా 383 గ్రామాల్లో జరిగిన సదస్సులతో కలిపి మొత్తం 16,900 దరఖాస్తులు అందాయి.
ప్రధానంగా మిస్సింగ్సర్వే నంబర్లు, పెండింగ్ మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, ఎక్స్టెంట్ కరెక్షన్, నేమ్ చేంజ్, సక్సెషన్, పీవోబీ, ల్యాండ్నేచర్కరెక్షన్తో పాటు సాదాబైనామా, పీవోటీ, న్యూ అసైన్మెంట్ తదితర పెండింగ్సమస్యలపై రైతులు దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు 10 వేలకు పైగా అప్లికేషన్ల వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చారు. వీటిలో అన్నీ క్లియర్‌గా ఉన్న 1,671 దరఖాస్తులను యాక్సెప్ట్ చేయగా, రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న 1,500 అప్లికేషన్స్‌ను రిజెక్ట్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 16855 దరఖాస్తులు రాగా 9538 దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దాదాపు 2600 దరఖాస్తుల పరిష్కారానికి ఆమోదం ఇచ్చారు. 3888 అప్లికేషన్లను తిరస్కరించారు. ఆదిలాబాద్ జిల్లాలో 11603 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 642 అప్లికేషన్లను పరిష్కరించారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 3820 దరఖాస్తులు రాగా 991 దరఖాస్తులను పరిశీలించారు. 212 అప్లికేషన్లను ఆమోదించి 123ను రిజెక్ట్ చేశారు.
సాదాబైనామాలు పెండింగ్
భూ భారతి చట్టం ద్వారా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విరాసత్, మిస్సింగ్ సర్వేనంబర్లు, ఎక్స్టెంట్ కరెక్షన్, డీఎస్ పెండింగ్, నేమ్ చేంజింగ్, పెండింగ్మ్యుటేషన్వంటి సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయి. మిస్సింగ్ల్యాండ్ రికవరీ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తున్న వాటిలో కుటుంబ తగాదాలు, వివాదాస్పద భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు ఉన్నాయి.
సాదాబైనామా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం వాటిని పక్కన పెట్టారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, కొత్తగా అసైన్మెంట్ కోసం వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే సక్సెషన్ కోసం వచ్చిన అప్లికేషన్లలో చాలామంది ఫీజు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ ఉన్నాయి.
పదేండ్ల తర్వాత పట్టా వచ్చింది
మా కుటుంబానికి చెందిన వారసత్వ పట్టా కోసం పదేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినా పని కాలేదు. ఇప్పుడు వచ్చిన భూ భారతిలో దరఖాస్తు పెట్టుకుంటే నా వాటా కింద రావాల్సిన 1.-26 గుంటలకు పట్టా వచ్చింది. భూ భారతి పుణ్యమాని పట్టా రావడం సంతోషంగా ఉంది. - లావుడ్య కిషన్, మొర్రిగూడ, జన్నారం
సీలింగ్ సమస్య పరిష్కారమైంది
నాకు లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ శివారులో సర్వే నంబర్ 218లో 20 గుంటల భూమి, సర్వే నంబర్ 220లో ఎకరం భూమి ఉంది. నా పాత పట్టా పాస్ బుక్‌లో కరెక్ట్‌గానే నమోదైనప్పటికీ ధరణిలో భూమి సీలింగ్‌లో చేర్చిన్రు. ఐదేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. రెవెన్యూ సదస్సులో మళ్లీ దరఖాస్తు చేసుకున్న. వెంటనే పరిష్కరించారు. పట్టా పాస్ బుక్ కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. - లింగాల కిష్టయ్య, లక్సెట్టిపేట