కొత్త జిల్లాలు ఏర్పాటైనా.. పాత జిల్లాల వారీగానే ప్రమోషన్లు​

  • రిక్రూట్ మెం ట్స్ మాత్రం కొత్త జిల్లాలతో..
  • 33 జిల్లాలున్నా.. 31 జిల్లాల లెక్కనే చేసే చాన్స్
  • ములుగు, నారాయణపేట జిల్లాల యూత్ కు అన్యాయం
  • కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం వచ్చాకే జోనల్,మల్టీ జోనల్ పోస్టుల భర్తీ

హైదారబాద్, వెలుగురాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా సర్కారు మాత్రం పాత జిల్లాల పాట పాడుతోంది. కొత్తగా స్టాఫ్​ను శాంక్షన్​ చెయ్యాల్సిన అవసరం లేకుండా, ఎక్కువగా ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం రాకుండా.. ఉద్యోగుల ప్రమోషన్లను పాత జిల్లాల లెక్కనే చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని డిపార్ట్​మెంట్లకు నోట్ పంపినట్టు సమాచారం. అయితే రిక్రూట్​మెంట్​ మాత్రం కొత్త జిల్లాల ప్రకారం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరించిన మేరకు 31 జిల్లాలు ప్రకారం రిక్రూట్​మెంట్​ చేపట్టాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన నారాయణపేట, ములుగు జిల్లాలకు ఉనికి లేకుండా పోతుందన్న చర్చ జరుగుతోంది. ఇక సవరించిన జోనల్ సిస్టంకు రాష్ట్రపతి ఆమోదం తీసుకునే విషయాన్ని సర్కారు పట్టించుకోవట్లేదన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.

3,500 పోస్టులకు ఎగనామం పెట్టేందుకే..

పాత జిల్లాల వారీగా ప్రమోషన్లు ఇవ్వాలన్న నిర్ణయం వెనుక సర్కారు సొంత ఎజెండా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఒక్క కొత్త పోస్టు కూడా మంజూరు చేయకుండానే సర్కారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అదనంగా ఏర్పాటైన 23 జిల్లాలకు కావాల్సిన స్టాఫ్​ను పాత జిల్లాల్లోని ఎంప్లాయీస్​తోనే అడ్జస్ట్​ చేశారు. పది జిల్లాల ఉద్యోగులను అడ్‌హాక్​ పద్ధతిలో విభజించి కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. కొత్త జిల్లాల వారీగా ప్రమోషన్లు చేపట్టాలంటే.. ముందుగా జిల్లాల మధ్య ఉద్యోగుల విభజన చేపట్టాలి. ఇలా విభజిస్తే ప్రతి జిల్లాలో సగటున 150 కొత్త పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అడిషనల్‌‌గా ఏర్పాటు చేసిన 23 జిల్లాలకు 3,500 కొత్త పోస్టులు అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు. ‘‘పాత జిల్లాల వారీగా ప్రమోషన్లు ఇస్తే ప్రభుత్వానికి ఎలాంటి తలనొప్పి ఉండదు. కొత్త జిల్లాల లెక్కన ఇస్తే.. కొత్త పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే సర్కారు పాత జిల్లాలవారీ ప్రమోషన్లకు రెడీ అయింది’’ అని సీనియర్ అధికారి అన్నారు.

కొత్త జిల్లాల వారీగా భర్తీ

ఉద్యోగాల భర్తీని కొత్త జిల్లాల వారీగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆఫీసర్లు చెప్తున్నారు. ముందుగా జిల్లా పోస్టుల భర్తీపై ఫోకస్ పెడుతున్నారు. జిల్లా కేడర్‌‌కు చెందిన టీచర్, పోలీసు కానిస్టేబుల్  ఉద్యోగాల్లో జరిపే పని నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఏర్పాటైన ములుగు, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన పోస్టుల భర్తీ అంతకు ముందున్న భూపాలపల్లి, మహబూబ్‌‌నగర్ జిల్లాల వారీగా చేస్తారని అంటున్నారు. 31 జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తే ములుగు, నారాయణపేట జిల్లాల వారికి అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ జిల్లాల నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులను భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు పొందే చాన్స్ ఉంటుందని, దీనిపై వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం కోసం సర్కారు సీరియస్ గా ప్రయత్నించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖకు ఫైల్ పంపి రాష్ట్ర సర్కారు చేతులు దులుపుకొందని చర్చ జరుగుతోంది.

 

Latest Updates