సముద్ర యాన్‌కూ ఇస్రో రెడీ

  • 2021 లేదా 2022లో ‘డీప్ సీ మిషన్’కు ఏర్పాట్లు  
  • గుండ్రటి క్రూ మాడ్యూల్ డిజైన్
  • సముద్ర గర్భంలోకి ముగ్గురు.. 6 కిలోమీటర్ల అడుగున అన్వేషణ  
  • వందల కోట్లతో భారీ మిషన్

మంగళ్ యాన్, చంద్రయాన్, గగన్ యాన్ తర్వాత మరో భారీ యాత్రకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈసారి అంతరిక్ష యాత్ర కాదు.. సముద్ర యాత్ర! మామూలు యాత్ర కాదు. ప్రస్తుతం జలాంతర్గాములు సైతం సముద్రంలో 200 మీటర్ల లోతుకు మించి వెళ్లలేవు. కానీ మన సైంటిస్టులు ఏకంగా 6 వేల మీటర్ల లోతుకు ముగ్గురు సైంటిస్టులను, రోబోటిక్ పరికరాలను పంపేందుకు సిద్ధమవుతున్నారు! ఇందుకు అత్యంత ముఖ్యమైన క్రూ మాడ్యూల్ డిజైన్ ను పూర్తి చేశారు. దీంతో వందల కోట్లతో చేపట్టబోయే ఈ మిషన్ లో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ మాడ్యూల్ డిజైన్‌‌ను ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేయాల్సి ఉందని మినిస్ట్రీ ఆఫ్ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ మాధవన్ నాయర్ రాజీవన్ వెల్లడించారు. ఈ మాడ్యూల్ డిజైన్ కు ఇస్రో అత్యంత క్లిష్టమైన టెక్నాలజీని వాడినట్లు చెప్పారు. గోళాకారంలో ఉండే ఈ చిన్న సబ్ మెర్సిబుల్ వెహికిల్ తయారీకి టైటానియం లోహాన్ని వాడనున్నట్లు తెలిపారు. ఈ మిషన్ కోసం సైంటిఫిక్, టెక్నికల్ వర్క్ ఇప్పటికే మొదలైందని వెల్లడించారు. క్రూ మాడ్యూల్ తయారీ కోసం ఇప్పటికే ఎన్ఐఓటీ, ఇస్రో మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. ఈ మిషన్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు, నావిగేషన్ విషయాల్లో కూడా ఎన్ఐఓటీ సహకారం అందించనుంది. హైదరాబాద్ లోని ఇన్ కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్), గోవాలోని ఎన్ సీపీఓఆర్, కొచ్చిలోని సీఎంఎల్ఆర్ఈ సంస్థలు కూడా ఈ మిషన్ లో ఇస్రోకు సాయం చేయనున్నాయి.

మన ‘సముద్రం’లో 38 కోట్ల టన్నుల ఖనిజాలు

సెంట్రల్ ఇండియన్ ఓసియన్ లో ఇండియాకు దాదాపు 75 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని యూఎన్ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ కేటాయించింది. ఈ ప్రాంతంలో ఇండియా ఖనిజాలు, ఇతర వనరులను కూడా ఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు. ఇండియన్ ఓసియన్ లో మనకు కేటాయించిన ప్రాంతంలోని సీ బెడ్ లో సుమారుగా38 కోట్ల మెట్రిక్ టన్నుల పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఉన్నాయట. ఐరన్, మాంగనీస్, నికెల్, కాపర్, కోబాల్ట్ తో కూడిన ముడి ఖనిజాలనే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. మనం ఈ ఖనిజ సంపదలో కేవలం 10 శాతం తెచ్చుకోగలిగినా.. ఇండియాకు వందేళ్ల పాటు ఇంధన అవసరాలు తీరిపోతాయట! అందుకే.. ఐదేళ్ల పాటు రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి, మన సముద్రాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ భావిస్తోంది. ఈ మిషన్ లో భాగంగా డీప్ సీ మైనింగ్ కోసం అండర్ వాటర్ వెహికిల్స్, అండర్ వాటర్ రోబోటిక్స్ ను కూడా ఇస్రో సైంటిస్టులు తయారు చేస్తున్నారు.

ఆరు కిలోమీటర్ల లోతున..

డీప్ సీ మిషన్ లో భాగంగా గోళాకార క్రూ మాడ్యూల్ లో ముగ్గురు రీసెర్చర్లను ఇస్రో పంపనుంది. వారు సముద్రంలో దాదాపు 6 కిలోమీటర్ల లోతు వరకూ వెళ్లి అక్కడ సముద్రం అడుగున అనేక అంశాలను స్టడీ చేయనున్నారు. క్రూ మాడ్యూల్ కనీసం 72 గంటల పాటు సముద్రం అడుగున అత్యంత తీవ్రమైన ప్రెజర్ ను తట్టుకుని ఉండగలిగేలా తయారు చేస్తున్నారు. మిషన్ లో భాగంగా సముద్రం అడుగున వాతావరణ మార్పులను అధ్యయనం చేస్తారు. అంత లోతులో ఏయే జీవులు ఉన్నాయి? అవెలా జీవిస్తున్నాయి? అక్కడి బయోడైవర్సిటీ ఎలా ఉందన్నది పరిశీలిస్తారు. హైడ్రోకార్బన్స్, ఖనిజాల నిల్వలను కూడా అన్వేషిస్తారు. సీ బెడ్ లోని పరిస్థితులను రోబోటిక్ పరికరాల ద్వారా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు.

Latest Updates