డెంగీని ఓడించి.. బిడ్డను బతికించిండు

15 రోజుల్లో నలుగురి మృతితో అప్పటికే కుటుంబంలో విషాదం
పసికందుకు తప్పిన ముప్పు

మంచిర్యాల, వెలుగు:  డెంగీ జ్వరం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఒకరితర్వాత మరొకరి ప్రాణాలను బలిగొంది. ముందు తండ్రి.. ఆ తర్వాత అతడి తాత. అనంతరం అతడి కూతురు. వెంటనే ఆయన భార్య… ఇలా ఒకరి తర్వాత ఒకరు నలుగురూ 15 రోజుల వ్యవధిలోనే చనిపోయారు. చివరకు గర్భంలో ఉన్న బిడ్డను కూడా డెంగీ వదల్లేదు. పండంటి కొడుకుకు జన్మనిచ్చిన తల్లి ఆ కొడుకును కనులారా చూడకముందే కన్నుమూసింది. పుట్టిన బిడ్డకు సైతం డెంగీ రావడంతో మంచిర్యాలలో శ్రీ మహాలక్ష్మీ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. పుట్టిన బిడ్డకు డెంగీ రావడం అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో డా. కుమార్ వర్మ ఉచితంగా వైద్యం అందించి నవజాత శిశువును డెంగీ నుంచి కాపాడారు. డెంగీ మహమ్మారితో ఆ కుటుంబంలో నలుగురు చనిపోయినా ఆ బాలుడిని మృత్యుంజయుడిగా నిలిపారు.

ఒకరి తరువాత ఒకరు..

మంచిర్యాల శ్రీశ్రీ నగర్ లో గుడిమల్ల రాజగట్టు కుటుంబం ఉండేది. ప్రైవేట్ టీచర్ గా పనిచేసే రాజగట్టుకు ఇద్దరు పిల్లలు.  భార్యకు మళ్లీ ప్రెగ్నెన్సీ. ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటున్న రాజగట్టు కుటుంబాన్ని డెంగీ జ్వరం అంతం చేసింది. అక్టోబర్ 16న గుడిమల్ల రాజగట్టు కరీంనగర్ ప్రైవేటు హాస్పిటల్ లో డెంగీతో చనిపోయారు. అక్టోబర్ 20న రాజగట్టు తాత ఈద లింగయ్య జ్వరంతో మరణించాడు. అక్టోబర్ 27న రాజగట్టు కూతురు శ్రీవర్షిణి డెంగీతో చనిపోయింది. శ్రీవర్షిణికి జ్వరం రావడంతో కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించారు. ప్లేట్ లెట్స్ తగ్గాయని రిపోర్ట్స్ రావడంతో.. హాస్పిటల్ కు తీసుకెళ్లిన మరునాడే ప్రాణాలు కోల్పోయింది.  ఇది జరిగిన 3 రోజులకే.. అక్టోబర్ 30న రాజగట్టు భార్య సోనీ డెంగీతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చనిపోయింది. అది సోనీకి డెలివరీ సమయం. అక్టోబర్ 28న అడ్మిట్ అయి 29న కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకును కళ్లారా చూడకముందే 30న కన్నుమూసింది. తీవ్రమైన దుఃఖంతో.. సోనీ శవం.. శిశువుతో రాజగట్టు కుటుంబసభ్యులు మంచిర్యాలకు వచ్చారు. ఇప్పటికే నలుగురిని కోల్పోయి బాధలో ఉన్న వారికి మరో కోలుకోలేని దెబ్బ తాకింది. సోనీ జన్మనిచ్చిన బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బాబును మంచిర్యాల శ్రీ మహాలక్ష్మీ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చేర్పించారు.

ఉచితంగా ట్రీట్​మెంట్​

బాబు తరఫున హాస్పిటల్ లో ఎవరూ లేకున్నా డాక్టర్ కుమార్ వర్మ దగ్గరుండి బాబుకు వైద్యం అందించడం మొదలుపెట్టారు. మూడు రోజులైనా బాబుకు జ్వరం తగ్గలేదు. జిల్లా ఏరియా ఆసుపత్రిలో డెంగీకి సంబంధించిన ఏలిసా టెస్ట్ చేయించారు. డెంగీ పాజిటివ్ రావడం.. ముప్పైవేల నుంచి పదివేలకు ప్లేట్ లెట్స్ పడిపోయాయని తేలింది. దాంతో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నాలుగుసార్లు సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ ఎక్కించారు. 17 రోజులపాటు హాస్పిటల్ లో ప్రతి సెకన్ గమనిస్తూ బాబుకు వైద్యం అందించారు. డాక్టర్ కుమార్ వర్మతోపాటు హాస్పిటల్ సిబ్బంది బాబు ఆరోగ్యం బాగుపడేదాకా ఎంతో శ్రమించారు. ఎట్టకేలకు బాబు కోలుకున్నాడు. ఇదే ట్రీట్​మెంట్​ఇతర హాస్పిటల్స్​లో అందించాలంటే లక్షలు ఖర్చయ్యేవి. కానీ డాక్టర్ కుమార్ వర్మ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా అన్ని ఖర్చులు ఆయనే పెట్టుకుని ఉచితంగా బాబుకు వైద్యం అందించారు. టెస్ట్ లు, ల్యాబ్, మెడికల్ అన్ని ఉచితంగానే చేశారు. అనారోగ్యంతో ఉన్న బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత  కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.

డాక్టర్కు రుణపడి ఉంటాం 

మా కుటుంబంలో నలుగురు వ్యక్తులను కోల్పోయి ఎంతో బాధలో ఉన్న మాకు డాక్టర్ చేసిన మేలు మరువలేనిది. డెంగీతో పుట్టిన మా మనుమడికి పైసా తీసుకోకుండా మెరుగైన చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో మాకు అప్పగించినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.

– శిశువు తాత, నానమ్మ

మరిన్ని వార్తల కోసం

Latest Updates