ఇండియా లోనే ఎత్తైన శాశ్వత వంతెన

  • దేశంలో ఎత్తయిన శాశ్వత వంతెన
  • చైనా సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం

లేహ్: మన దేశంలోనే ఎత్తయిన శాశ్వత వంతెన ప్రారంభమైంది. తూర్పు లడాఖ్​లో నిర్మించిన ‘కల్నల్ చెవాంగ్ రించెన్ సేతు’ను రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. షియోక్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి ఆయన జాతికి అంకితం చేశారు. దీనికి కల్నల్ చెవాంగ్ రించెన్ పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి ద్వారా చైనాతో సరిహద్దు దౌలత్ బేగ్ ఓల్దీ సెక్టార్​కు లడాఖ్ నుంచి మన సేనలు సులభంగా చేరుకోగలుగుతాయి.

లయన్ ఆఫ్ లడాఖ్

లడాఖ్​లో కట్టిన బ్రిడ్జికి ప్రభుత్వం కల్నల్ చెవాంగ్ రించెన్ పేరు పెట్టింది. 1931లో లడాఖ్ లోని నుబ్రా వ్యాలీలో సుమురు గ్రామంలో చెవాంగ్ రించెన్ పుట్టారు. నుబ్రా గార్డ్స్​లో 1948లో చేరిన ఆయన.. ఆర్మీలో వివిధ హోదాల్లో పని చేశారు. లేహ్, పర్తాపూర్ సెక్టార్​లను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా మహా వీర చక్ర అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. అది కూడా ఒక సారి కాదు రెండుసార్లు. మహా వీర చక్ర పథకాన్ని రెండు సార్లు అందుకున్న ఆరుగురు ఆర్మీ అధికారుల్లో రించెన్ ఒకరు. దేశంలో రెండో అతిపెద్ద గ్యాలంట్రీ అవార్డు ఇది. కల్నల్ రించెన్​కు ‘లయన్ ఆఫ్ లడాఖ్’ అని బిరుదు కూడా ఉంది.

బ్రిడ్జి ప్రత్యేకతలివీ..

షియోక్ నదిపై 1400 అడుగుల పొడవున ఈ బ్రిడ్జిని నిర్మించారు.

దేశంలో అత్యంత ఎత్తయిన ఆల్​వెదర్ పర్మనెంట్ బ్రిడ్జి ఇది.

ముఖ్యంగా చైనా సరిహద్దులకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అత్యవసర సమయంలో సోల్జర్స్​ను అక్కడికి త్వరగా తరలించవచ్చు. సైన్యానికి ఇది వ్యూహాత్మక వంతెన అని ప్రభుత్వం చెబుతోంది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 15 నెలల్లోనే బ్రిడ్జి కట్టేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ సూపర్ స్ట్రక్చర్​ను ‘ఎక్స్​ట్రా వైడ్ బెయిలీ బ్రిడ్జి’ అని పిలుస్తారు.

ఇండియాలో తొలిసారిగా మైక్రోపైలింగ్ టెక్నిక్ ద్వారా కట్టారు.

బ్రిడ్జి పొడవునా 10 ఐరన్ స్పాన్లు ఏర్పాటుచేశారు. ఒక్కోటి 140 అడుగుల పొడవు ఉంటాయి. 4.25 మీటర్ల ఎత్తు ఉంటాయి.

ఈ వంతెన అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం గతంతో పోలిస్తే సగానికి తగ్గింది.

Latest Updates