ముస్లిం సోదరులారా!.. రక్షణ మంత్రిగా చెబుతున్నా: మిమ్మల్నెవరూ టచ్ చేయలేరు

పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై సందేహాలు పెట్టుకోవద్దని కోరారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ముస్లిం సోదరులా దయచేసి నమ్మండి అంటూ భావోద్వేగ భరితంగా మాట్లాడారాయన. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. సీఏఏపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వాన్నీ ఈ చట్టం లాక్కోదని చెప్పారు.

ముఖ్యంగా ముస్లిం సోదరులకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని అన్నారు రాజ్‌నాథ్. ‘‘మీరు మాకు (బీజేపీకి) ఓటేయండి. వేయకపోండి. అది మీ ఇష్టం. కానీ మా నిర్ణయాలు, ఉద్దేశాలను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయ చేసి ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. భారత రక్షణ మంత్రిగా చెబుతున్నా. ఏ ఒక్క భారత ముస్లింను ఎవరూ టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు. మీకు అండగా మేం ఉన్నాం. ఎన్నటికీ మీ పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోలేరు ’’ అంటూ ఉద్వేగభరితంగా చెప్పారు రాజ్‌నాథ్ సింగ్.

హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు రక్షణ మంత్రి. మైనారిటీలు గౌరవప్రదంగా బతికేలా భారత్ చూసుకుందన్నారు. కానీ, పాక్, అప్ఘాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీ జీవితం దుర్భరంగా మారిందని చెప్పారు రాజ్‌నాథ్. అక్కడ మత హింస ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా, 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు రాజ్‌నాథ్.

Latest Updates