33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

భారత్ , చైనా సరిహద్దుల్లో రోజు రోజుకూ  ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం తన అస్త్రాలను మెరుగు పర్చుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్‌ ఎక్విజిషన్‌ కౌన్సిల్‌ (DAC) గ్రీన్ సిగ్నలిచ్చింది.

21 MIG -29 యుద్ధ విమానాలతో పాటు 59 MIG -29 విమానాల ఆధునీకరణకు DAC గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు 12 SU-30 ఎంకేఐల కొనుగోలుకూ పచ్చజెండా ఊపింది. రష్యా నుంచి MIG -29 యుద్ధవిమానాల కొనుగోలు, ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుండగా,10,730 కోట్ల రూపాయలతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)  నుండి తయారయ్యే 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది.

యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలా కాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్‌) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి కొనుగోలు చేయనున్నారు.

భారత వైమానిక దళం ,నావికాదళం కోసం 248 ఆస్ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ ను ఎయిర్ క్షిపణులకు కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ. దీంతో పాటు DRDO చేత తయారు చేయబడే 1,000 కిలోమీటర్ల ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణి రూపకల్పన,అభివృద్ధి కూడా గ్రీన్ సిగ్నలిచ్చింది.

Latest Updates